బడ్జెట్-2024లో కేటాయింపులు పెంచాలంటున్న కార్పొరేట్ రంగం

by Dishanational1 |
బడ్జెట్-2024లో కేటాయింపులు పెంచాలంటున్న కార్పొరేట్ రంగం
X

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవర్ 1న ప్రవేశ పెట్టబోయే మధ్యంతర బడ్జెట్‌పై వివిధ రంగాల నుంచి అనేక ప్రతిపాదనలు చేరాయి. కార్పొరేట్ రంగం నుంచి పలు అభ్యర్థనలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. తయారీ రంగాన్ని ప్రోత్సహించడమే కాకుండా మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాలని, పన్నుల విషయంలో ఉపశమనం ఇస్తూనే సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టాలని కంపెనీలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఐదు వార్షిక బడ్జెట్‌లను సమర్పించిన నిర్మలా సీతారామన్ 2024-25కి సంబంధించి బడ్జెట్ ప్రకటన చేస్తారు. ఎన్నికల ఏడాది కావడంతో అన్ని వర్గాలు అనేక అంచనాలతో బడ్జెట్ కోసం ఎదురుచూస్తున్నాయి.

రానున్న సంవత్సరాల్లో మూడవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఎదుగుతున్న నేపథ్యంలో భారత ఆర్థిక వృద్ధిని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అత్యవసరమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. తయారీలో నాణ్యత, ఉత్పాదకత పెంపొందించేందుకు 'నేషనల్ మిషన్ ఫర్ అడ్వాన్స్‌డ్ మాన్యూఫక్చరింగ్' ప్రారంభించాలని పరిశ్రమల సంఘం సీఐఐ సూచించింది. 'సాంకేతికంగా అభివృద్ధి చెందిన తయారీ రంగానికి ఈ మిషన్ బలోపేతం చేయగలదని, తయారీ రంగంలో కొత్త టెక్నాలజీ వినియోగాన్ని వేగవంతం చేయాలని' సీఐఐ అభిప్రాయపడింది.

అలాగే, దుస్తులు, బొమ్మలు వంటి ఉపాధి కల్పనకు ఎక్కువ వెసులుబాటు ఉన్న కార్మిక ఆధారిత రంగాలకు, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు దేశీయ సామర్థ్యం కలిగిన కేపిటల్ గూడ్స్, రసాయనాలు వంటి రంగాలకు పీఎల్ఐ పథకాన్ని విస్తరించడం అవసరమని సీఐఐ పేర్కొంది. 'భారత్ ప్రస్తుతం కీలక దశలో ఉంది. గ్లోబల్ పరిణామాలు, సంబంధిత సవాళ్ల మధ్య రాబోయే బడ్జెట్‌లో అన్ని విభాగాల్లోనూ మూలధన వ్యయాన్ని సమర్థవంతంగా కేటాయించాలి. ఇదే సమయంలో వైద్య పరికరాల దిగుమతులపై ప్రస్తుత టారిఫ్ చాలా ఎక్కువగా ఉందని' మెడికల్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ పవన్ చౌదరీ అన్నారు. ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల ద్వారా ప్రజలకు తక్కువ ధరకే వైద్యం అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు విరుద్ధంగా అధిక కస్టమ్స్ డ్యూటీ వైద్య పరికరాల ధరలపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. కాబట్టి ప్రత్యామ్నాయానికి దిగుమతి చేసుకునే ఉత్పత్తుల కోసం కస్టమ్స్ సుంకం రేటు తగ్గించాలని ఆయన కోరారు.

Next Story

Most Viewed