UPI: విదేశాల్లో సులభంగా యూపీఐ చెల్లింపులు

by S Gopi |

దీనివల్ల భారతీయ వినియోగదారులు విదేశాలకు వెళ్లిన సమయంలో డిజిటల్ చెల్లింపులు చేయడం మరింత సులభతరం అవుతుంది.

UPI: విదేశాల్లో సులభంగా యూపీఐ చెల్లింపులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయంగా భారత యూపీఐ సేవలను విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం, భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా గ్లోబల్ డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫామ్ అలిపే ప్లస్‌ని మన స్వంత చెల్లింపుల వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ)తో అనుసంధానం చేయడానికి చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. దీనివల్ల భారతీయ వినియోగదారులు విదేశాలకు వెళ్లిన సమయంలో డిజిటల్ చెల్లింపులు చేయడం మరింత సులభతరం అవుతుంది. భారతీయ వినియోగదారులు కొత్త యాప్ లేదా నగదు అవసరం లేకుండా యూపీఐని ఉపయోగించి విదేశాల్లో చెల్లింపులు చేయవచ్చు. అలిపే ప్లస్ అనేది యాంట్ ఇంటర్నేషనల్ యాజమాన్యంలో ఉన్న గ్లోబల్ చెల్లింపుల నెట్‌వర్క్. ఇది ఒకప్పుడు చైనాకు చెందిన యాంట్ గ్రూప్‌లో భాగమైనప్పటికీ, ప్రస్తుతం స్వతంత్ర సంస్థగా కొనసాగుతోంది. ఈ సంస్థ 100 కంటే ఎక్కువ దేశాల్లో 180 కోట్లకు పైగా కస్టమర్ల అకౌంట్లను, 15 కోట్లకు పైగా వ్యాపారులను కలుపుతోంది. దీని ద్వారా వినియోగదారులు ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఆన్‌లైన్ చెల్లింపులు చేయవచ్చు. యూపీఐతో అలిపే ప్లస్‌ను లింక్ చేయడం ద్వారా భారతీయ వినియోగదారులు ఇతర దేశాల్లో ఉన్నప్పుడు కూడా యూపీఐని వాడుకోవచ్చు. చర్చలు విజయవంతమైతే, మనవాళ్లు త్వరలో విదేశీ కరెన్సీ లేదా ప్రత్యేక డిజిటల్ వ్యాలెట్ల అవసరం లేకుండా యూపీఐ ద్వారా విదేశాల్లో తక్షణ చెల్లింపులు చేసుకోవచ్చు.

Next Story