Nirmala Sitharaman: విదేశీ పెట్టుబడులు తరలిపోవడంపై స్పందించిన నిర్మలా సీతారామన్

by S Gopi |

విదేశీ పెట్టుబడులు తరలిపోవడం ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.

Nirmala Sitharaman: విదేశీ పెట్టుబడులు తరలిపోవడంపై స్పందించిన నిర్మలా సీతారామన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: గడిచిన కొన్ని నెలలుగా భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున నిధులను ఉపసంహరించుకుంటున్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. సోమవారం ముంబైలో జరిగిన బడ్జెట్ అనంతర ఇంటరాక్షన్‌లో విలేకరులతో ఆర్థిక మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా భారత మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు(ఎఫ్ఐఐ) ఎక్కువ మొత్తం నిధులను వెనక్కి తీసుకెళ్లడంపై బదులిస్తూ.. వారందరికీ భారత్‌లో పెట్టుబడుల ద్వారా మెరుగైన లాభాలు అందుతున్నాయి. మన దేశం పెట్టుబడులు అనుకూలమైన రాబడినిచ్చే వాతావరణాన్ని కలిగి ఉంది. అందుకే ఎఫ్ఐఐలు లాభాల స్వీకరణకు ఇష్టపడుతున్నారని తెలిపారు. ఇదే అంశంపై ఆర్థిక శాఖ కార్యదర్శి తుహిన్ కాంత పాండె కూడా మాట్లాడారు. విదేశీ పెట్టుబడులు తరలిపోవడం ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. వాటిలో ఎక్కువగా అమెరికాకు చెందిన ఎఫ్ఐఐలే ఉన్నారు. వారంతా డాలర్ పెరుగుదల, బాండ్ల రాబడి, ఇతర అంశాల కారణంగా తమ సొంత దేశానికి నిధులను మళ్లిస్తున్నారు. భారత్ ఇప్పటికీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉంది. భవిష్యత్తులోనూ ఈ వృద్ధి కొనసాగుతుందన్నారు. గణాంకాల ప్రకారం, గతేడాది అక్టోబర్ నుంచి ఎఫ్ఐఐలు రూ. 1.7 లక్షల కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఈ ఏడాదిలోనూ గత నెల కీలక రంగాలలైన కెమికల్స్, టెలికాం, మీడియా షేర్లను విదేశీ మదుపర్లు పెద్ద ఎత్తున విక్రయించారు. ఈ నెలలోనూ ట్రెండ్ కొనసాగుతోంది. ఈ సమావేశంలోనే ద్రవ్యోల్బణం గురించి అడిగిన ప్రశ్నకు.. ధరల పెరుగుదల నియంత్రించి సరఫరా మెరుగుపడేందుకు నిర్ణయాలు తీసుకుంటున్నాం. డిమాండ్ పెంచేందుకు కావాల్సిన చర్యలను ఆర్‌బీఐ తీసుకుంటోందని పేర్కొన్నారు.

Next Story