JioBlackRock: భారత్‌పైనే ప్రపంచ దృష్టి: ముఖేష్ అంబానీ

by S Gopi |

రాబోయే దశాబ్ద కాలంలో భారత్ ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్న 80 శాతం తన ఇంధన అవసరాలను గణనీయంగా తగ్గిస్తుంది.

JioBlackRock: భారత్‌పైనే ప్రపంచ దృష్టి: ముఖేష్ అంబానీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్ మెరుగైన వృద్ధి, స్థిరమైన నాయకత్వం, కీలక పాలసీ నిర్ణయాలతో ప్రపంచాన్ని ఆకర్షిస్తోందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ స్థిరమైన రెండంకెల వృద్ధిని సాధించడం సాధ్యమేనని తెలిపారు. బుధవారం 'ఒక కొత్త శకం కోసం పెట్టుబడి' అనే అంశంపై జరిగిన జియోబ్లాక్‌రాక్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. దేశ దీర్ఘకాలిక వృద్ధి అనేది ఇంధన స్వయం సమృద్ధిని సాధించడంపై ఆధారపడి ఉంటుంది. రాబోయే దశాబ్ద కాలంలో భారత్ ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్న 80 శాతం తన ఇంధన అవసరాలను గణనీయంగా తగ్గిస్తుంది. మౌలిక సదుపాయాల ఖర్చుతో పాటు ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు కూడా దీర్ఘకాలిక పెట్టుబడి లక్ష్యాలు అవసరం. ఇది దేశ ఆర్థిక స్థిరత్వానికి, దేశం వెలుపలి సవాళ్లను ఎదుర్కొనేందుకు చాలా అవసరమని ముఖేష్ అంబానీ స్పష్టం చేశారు. ఇదే సమయంలో దేశంలో పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాల వృద్ధి కారణంగా స్టార్టప్‌ కంపెనీలు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ వృద్ధి కొనసాగితే భవిష్యత్తులో రిలయన్స్‌ లాంటి సంస్థలు వందల్లో వస్తాయని అంబానీ వెల్లడించారు.

'ఎరా ఆఫ్ ఇండియా'

ఇదే కార్యక్రమంలో మాట్లాడిన బ్లాక్‌రాక్ సీఈఓ లారీ ఫింక్.. రాబోయే 20-25 సంవత్సరాలు 'ఎరా ఆఫ్ ఇండియా' కొనసాగుతుందని, వచ్చే దశాబ్దంలో లేదా అంతకంటే ఎక్కువ కాలంలో భారత్ 8-10 శాతం వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని అన్నారు. అందుకే తాను పెట్టుబడి పెట్టాలనుకునే దేశం భారత్ ఒకటేనని, అయితే, భారత్ విదేశీ నిధులపై ఆధారపడాల్సిన అవసరంలేదని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ప్రశంసించిన లారీ ఫింక్, డిజిటలైజ్‌డ్ రూపాయి దేశంలో వాణిజ్యాన్నే మార్చి వేసింది. ఇతర దేశాలు, ముఖ్యంగా అమెరికా కూడా భారత్ కంటే వెనుకబడిపోతోంది. ఈ విషయంలో తమకు ఆందోళనగానే ఉందని పేర్కొన్నారు.

Next Story