Crude Oil: రష్యా నుంచి 112 బిలియన్ యూరోల విలువైన చమురును కొనుగోలు చేసిన భారత్

by S Gopi |

ఈ ఏడాది మార్చి 2 వరకు రష్యా నుంచి భారత్ 205.84 బిలియన్ యూరోల విలువైన శిలాజ ఇంధనాన్ని కొనుగోలు చేసింది.

Crude Oil: రష్యా నుంచి 112 బిలియన్ యూరోల విలువైన చమురును కొనుగోలు చేసిన భారత్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతి దేశంగా భారత్ ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా వద్ద 112.5 బిలియన్ యూరోల విలువైన ముడి చమురును కొనుగోలు చేసిన యూరోపియన్ థింక్ ట్యాంక్ తెలిపింది. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సీఆర్ఈఏ) 2022, ఫిబ్రవరి 24 నుంచి రష్యాకు జరిగిన చెల్లింపులపై ఓ నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం, ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఈ ఏడాది మార్చి 2 వరకు రష్యా నుంచి భారత్ 205.84 బిలియన్ యూరోల విలువైన శిలాజ ఇంధనాన్ని కొనుగోలు చేసింది. ఇందులో ముడి చమురు కోసం 112.5 బిలియన్ యూరోలు(121.59 బిలియన్ డాలర్లు) వెచ్చించింది. ముడి చమురును పెట్రోల్, డీజిల్‌ల కోసం శుద్ధి చేస్తారు. ముడి చమురు అవసరాలను తీర్చేందుకు 85 శాతం కంటే ఎక్కువ దిగుమతులపై ఆధారపడిన భారత్, 2022-24లో ముడి చమురు దిగుమతులపై 232.7 బిలియన్ డాలర్లు, 2023-24లో 234.3 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 10 నెలల్లో 195.2 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.

సాంప్రదాయంగా మధ్యప్రాచ్యం నుంచి చమురును కొనుగోలు చేసే భారత్, 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత రష్యా నుంచి చమురు దిగుమతిని ప్రారంభించింది. రష్యాపై యూరప్ దేశాలు ఆంక్షలు విధించడమే ఇందుకు ప్రధాన కారణం. ఫలితంగా గతంలో భారత్ మొత్తం ముడి చమురు దిగుమతుల్లో 1 శాతంగా ఉన్న రష్యా వాటా తక్కువ వ్యవధిలో 40 శాతానికి పెరిగింది. దిగుమతుల ద్వారా కొన్ని దేశీయ రిఫైనరీలు రష్యా ముడి చమురును పెట్రోల్, డీజిల్ ఇంధనాలుగా శుద్ధి చేసి యూరప్, ఇతర జీ7 దేశాలకు ఎగుమతి చేశాయి. అయితే, అమెరికా కొన్ని కార్గోలపై నిషేధం విధించడంతో దిగుమతులు తగ్గినప్పటికీ భారత్‌కు ఎక్కువ ముడి చమురు అందిస్తున్న దేశంగా రష్యా కొనసాగుతోంది. ఫిబ్రవరిలో రష్యా నుంచి రోజుకు 14.8 లక్షల బ్యారెళ్ల ముడి చమురు దిగుమతి జరిగింది. అంతకుముందు నెలలో 16.7 లక్షల బ్యారెళ్ల దిగుమతి జరిగింది.

మరోవైపు, రష్యా చమురు కంపెనీలు, ట్యాంకర్లపై అమెరికా కఠిన ఆంక్షల కారణంగా భారతీయ రిఫైనరీ సంస్థలు ప్రత్యామ్నాయ సరఫరాను పరిశీలిస్తున్నాయి. దీనివల్ల గత నెలలో అమెరికా నుంచి భారత్‌కు ముడి చమురు ఎగుమతులు రెండేళ్లలోనే అత్యధికంగా పెరిగాయని కెప్లర్ షిప్ ట్రాకింగ్ డేటా తెలిపింది. ఫిబ్రవరిలో భారత్‌కు అమెరికా రోజుకు 3,57,000 బ్యారెళ్ల ముడి చమురును ఎగుమతి చేసింది. గతేడాది ఇదే నెలలో అమెరికా నుంచి భారత్‌కు రోజుకు 2,21,000 బ్యారెళ్ల ముడి చమురు ఎగుమతి జరిగింది. గతేడాది అమెరికా నుంచి భారత ఇంధన కొనుగోళ్ల విలువ 15 బిలియన్ డాలర్ల నుంచి 25 బిలియన్ డాలర్లకు పెరగవచ్చని అధికారులు తెలిపారు.

Next Story