Economy: ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థ భారత్

by S Gopi |

భారత్ కంటే ముందు అమెరికా, చైనా, జర్మనీ మాత్రమే పెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉన్నాయని బీవీఆర్ సుబ్రహ్మణ్యం అన్నారు.

Economy: ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థ భారత్
X

దిశ, బిజినెస్ బ్యూరో: జపాన్‌ను అధిగమించి భారత్ ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం శనివారం ప్రకటించారు. నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశం తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. భారత జీడీపీ ఇప్పుడు 4 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. భారత్ కంటే ముందు అమెరికా, చైనా, జర్మనీ మాత్రమే పెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉన్నాయని బీవీఆర్ సుబ్రహ్మణ్యం అన్నారు. అంతర్జాతీయంగా అస్థిరత, సవాళ్లు ఉన్నప్పటికీ భారత ఆర్థికవ్యవస్థ స్థిరంగా రాణిస్తోందని, ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచిందని తెలిపారు. ముఖ్యంగా పెట్టుబడులకు కీలక గమ్యంగా భారత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించడం ద్వారానే ఈ మైలురాయిని సాధించగలిగినట్టు ఆయన వివరించారు.

మూడేళ్లలో జర్మనీ వెనక్కి

ఐఎంఎఫ్ గణాంకాల ఆధారంగా దేశ ఆర్థిక ఆర్థిక వృద్ధిపై స్పష్ట వస్తుందని, ప్రపంచ ఆర్థిక ర్యాంకింగ్‌లో మనం అమెరికా, చైనా, జర్మనీ తర్వాతి స్థానంలో ఉన్నామని పేర్కొన్నారు. ఇదే తరహా వృద్ధిని కొనసాగించగలిగితే మరో రెండున్నర, మూడేళ్లలో జర్మనీని కూడా అధిగమించి మూడవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా మారగలమని సుబ్రమణ్యం అభిప్రాయపడ్డారు. దీనికోసం ప్రభుత్వం మూలధన కేటాయింపులను పెంచడం, వ్యాపారాల నిర్వహణను సులభతరం చేయడం, వ్యాపార నిర్వహణ ఖర్చులను తగ్గించడం, తయారీకి ఎక్కువ ప్రాధాన్యత, ప్రపంచ మార్కెట్ లక్ష్యంగా పని చేయడం వంటి నిర్ణయాలతో దీన్ని సాధించగలమని అన్నారు. ప్రస్తుతం దేశ అనుసరిస్తున్న డిజిటల్ వృద్ధి ద్వారా వచ్చే పదేళ్ల కాలంలో భారత ఎదుగుదలకు అత్యంత కీలకమని సుబ్రమణ్యం తెలిపారు.

ఈ సందర్భంగా అమెరికాలో విక్రయించే యాపిల్ ఫోన్‌లను భారత్ లేదా మరెక్కడైనా తయారు చేయొద్దని, అమెరికాలోనే వాటిని తయారు చేయాలని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల గురించి అడిగిన ప్రశ్నకు.. టారిఫ్‌ల గురించి ఇప్పటికీ సరైన స్పష్టత లేదు. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యంత చౌకగా తయారీని అందించగల దేశం ఏదైనా ఉందంటే అది భారత్ మాత్రమేనని సుబ్రమణ్యం స్పష్టం చేశారు. ప్రభుత్వ అసెట్ మానిటైజేషన్ ప్లాన్ కొత్త దశను సిద్ధం చేస్తున్నామని, ఆగస్టులో దాని గురించి ప్రకటిస్తామని కూడా ఆయన చెప్పారు.

Next Story