India: ప్రపంచంలో 3వ అతిపెద్ద మొబైల్ ఎగుమతి దేశంగా భారత్

by S Gopi |

20.5 బిలియన్ డాలర్ల(మన కరెన్సీలో రూ. 1.77 లక్షల కోట్ల) విలువైన మొబైల్ ఫోన్‌లను ఎగుమతి చేసిన మూడో దేశంగా నిలిచింది.

India: ప్రపంచంలో 3వ అతిపెద్ద మొబైల్ ఎగుమతి దేశంగా భారత్
X

దిశ, బిజినెస్ బ్యూరో: మొబైల్‌ఫోన్ల ఎగుమతులకు సంబంధించి భారత్ అరుదైన ఘనతను సాధించింది. దశాబ్దం కంటే తక్కువ కాలంలో అత్యధిక మొబైల్‌ఫోన్లను దిగుమతి చేసుకున్న దేశం నుంచి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే దేశంగా అవతరించింది. దీనికి సంబంధించి సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ స్టడీస్‌(సీడీఎస్) డైరెక్టర్ ప్రొఫెసర్ వీరమణి ఆధ్వర్యంలో జరిగిన అధ్యయనం ప్రకారం, గతేడాదిలో మాత్రమే మనదేశం నుంచి 20.5 బిలియన్ డాలర్ల(మన కరెన్సీలో రూ. 1.77 లక్షల కోట్ల) విలువైన మొబైల్ ఫోన్‌లను ఎగుమతి చేసిన మూడో దేశంగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎల్ఐ పథకం ఇందుకు దోహదపడింది. తయారీ రంగాన్ని వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2020లో ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకాన్ని తీసుకొచ్చింది. దీన్ని ఆసరాగా చేసుకుని భారత్ చాలా తక్కువ సమయంలో వేగంగా మొబైల్‌ఫోన్ తయారీలో రాణించిందని సీడీఎస్ అభిప్రాయపడింది.

2014-15లో దేశీయ డిమాండ్ ఆధారంగా మనదేశం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడేది. 2017-18 సమయంలో కేవలం 0.2 బిలియన్ డాలర్లు(రూ. 1,700 కోట్లు) విలువైన ఎగుమతులను మాత్రమే చేసేవాళ్లం. కానీ 2024-25 నాటికి ఇది దాదాపు 12,000 శాతం వృద్ధితో 24.1 బిలియన్ డాలర్ల(రూ. 2 లక్షల కోట్ల) మార్కును అధిగమించాం. భారత తయారీ రంగంలో ఇది నిర్మాణాత్మక మార్పు అని సీడీఎస్ అభిప్రాయపడిని. ఎగుమతులు ఇప్పుడు దేశీయ వినియోగాన్ని మించి జరగడం విశేషం. ఇది అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో చాలా అరుదని పేర్కొంది. మరోవైపు, ఈ వృద్ధి కారణంగా ప్రత్యక్ష, పరోక్ష పద్ధతిలో 17 లక్షల మందికి ఉపాధి లభించినట్టు సీడీఎస్ అంచనా వేసింది. అనుబంధంగా ఉద్యోగాల సంఖ్య 33 రెట్లు పెరిగింది. కాగా, ప్రస్తుతం ప్రపంచంలోనే మొబైల్ ఫోన్ల ఎగుమతుల్లో చైనా అగ్రస్థానంలో ఉండగా, వియత్నాం, హాంకాంగ్ దేశాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇప్పుడు భారత్ మూడో స్థానానికి చేరింది.

Next Story