- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ADB: ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాక్ నిధులివ్వొద్దని ఏడీబీని కోరిన భారత్
పాక్‌కు అందించే నిధుల్లో కోత విధించాలని కోరినట్టు సోమవారం ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: పెహల్‌గామ్ దాడి తర్వాత ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌పై భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. దాయాది దేశానికి తగిన బుద్ధి చెప్పాలని భావించిన భారత ప్రభుత్వం అందుకు తగినట్టుగానే కఠిన చర్యలు తీసుకుంది. ఇదే సమయంలో అంతర్జాతీయ వేదికపైనా పాక్ బుద్ధిని బయటపెట్టాలని, ఎప్పటికప్పుడు కుట్రకు దిగే పాక్‌ను అన్ని రకాలుగా ఒంటరిని చేసేందుకు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే పాక్‌కు రుణమిచ్చే అంశంపై చర్చించేందుకు ఈ వారాంతంలో జరిగే ఐఎంఎఫ్ సమావేశానికి పరమేశ్వరన్ అయ్యర్‌ను తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టాలని కోరింది. తాజాగా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం ఆసియా అభివృద్ధి బ్యాంక్(ఏడీబీ) అధ్యక్షుడిని కలిసి పాక్‌కు అందించే నిధుల్లో కోత విధించాలని కోరినట్టు సోమవారం ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఏడీబీ అధ్యక్షుడు మసాటో కందాతో పాటు, ఇటాలియన్ ఆర్థిక మంత్రి జియాన్‌కార్లో గియోర్గెట్టిని కూడా కలిసిన నిర్మలా సీతారామన్, ఇదే అంశంపై భారత్ డిమాండ్‌ను వినిపించారు.
ఇప్పటికే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాక్ ఐఎంఎఫ్‌తో పాటు ఏడీబీ నుంచి అందుతున్న నిధులపై ఆధారపడి నిలదొక్కుకుంటోంది. పెహల్‌గామ్ దాడిని దృష్టిలో ఉంచుకుని ఉగ్రవాదానికి ఆర్థిక సాయం చేస్తున్న పాక్‌కు ఏడీబీ నిధులు చేరకుండా చేయడం ద్వారా మరింత ఇరుకున పెట్టాలని భారత్ భావిస్తోంది. మరోవైపు, 2024, జూలైలో మూడేళ్లకు జరిగిన ఒప్పందంలో భాగంగా పాక్‌కు ఐఎంఎఫ్ 7 బిలియన్ డాలర్ల సహాయక ప్యాకేజీ ఇస్తోంది. దీనిపై కూడా భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరో కీలక అడుగులో భాగంగా, పాకిస్తాన్‌ను తిరిగి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) గ్రే లిస్ట్‌లో ఉంచడాన్ని ప్రయత్నాలు చేస్తోంది. దీనివల్ల పాక్ ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ సంబంధాలు, ఆర్థిక రంగాన్ని మరింత దెబ్బతీస్తుంది. అదే సమయంలో ప్రపంచం ముందు పాకిస్తాన్ ఆర్థిక పేరు ప్రతిష్టలకు భంగం వాటిల్లుతుంది.






