Domestic Manufacturing: ‘మేడ్ ఇన్ ఇండియా’పై కేంద్రం ఫోకస్

by S Gopi |

భారత్‌లో తయారు కాని లేదా తగిన స్థాయిలో ఉత్పత్తి లేని సుమారు 100 ఉత్పత్తులను గుర్తించి, వాటి తయారీని స్థానికంగా ప్రారంభించే దిశగా పరిశ్రమలతో చర్చిస్తోంది.

Domestic Manufacturing: ‘మేడ్ ఇన్ ఇండియా’పై కేంద్రం ఫోకస్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ తయారీ రంగాన్ని బలోపేతం చేయడంపై కేంద్ర ప్రభుత్వం మరింత శ్రద్ధ పెడుతోంది. ప్రస్తుతం భారత్‌లో తయారు కాని లేదా తగిన స్థాయిలో ఉత్పత్తి లేని సుమారు 100 ఉత్పత్తులను గుర్తించి, వాటి తయారీని స్థానికంగా ప్రారంభించే దిశగా పరిశ్రమలతో చర్చిస్తోంది. డీపీఐఐటీ కార్యదర్శి అమర్‌దీప్ సింగ్ భాటియా వెల్లడించిన వివరాల ప్రకారం.. యాక్సిల్స్, మోటార్‌సైకిల్ విడిభాగాలు వంటి ఆటో రంగ ఉత్పత్తులు ఇప్పటికే ఈ జాబితాలో ఉన్నాయి. దేశీయ మార్కెట్‌తో పాటు గ్లోబల్ మార్కెట్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని తయారీ సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాకుండా దేశీయ పరిశ్రమలకు నాణ్యత ఆధారిత గుర్తింపునివ్వడానికి కేంద్రం ‘మేడ్ ఇన్ ఇండియా’ స్కీమ్‌ను కూడా తీసుకురానుంది. ఈ స్కీమ్ కింద ప్రత్యేక లోగోతో కూడిన బ్రాండ్ గుర్తింపును కంపెనీలకు ఇవ్వనున్నారు. ఇది కేవలం దేశీయ విలువ పెంచడం మాత్రమే కాకుండా, నాణ్యత విషయంలోనూ హామీ ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఏ రంగాలను ఈ పథకంలో చేర్చాలన్నదానిపై పరిశ్రమలతో చర్చలు కొనసాగుతున్నాయి. దీనివల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మారుతున్న గ్లోబల్ సప్లై చైన్ ద్వారా తయారీ రంగానికి కొత్త అవకాశాలు పెరుగుతాయని భాటియా పేర్కొన్నారు. ఏఐ కారణంగా ఉత్పాదకత, ఆవిష్కరణలు వేగంగా పెరుగుతున్నాయని, పరిశ్రమలు ఈ మార్పులకు సిద్ధంగా ఉండాలని సూచించారు. అలాగే, భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏలు) దేశీయ కంపెనీలకు అంతర్జాతీయ మార్కెట్లలో విస్తరణకు దోహదపడతాయని వెల్లడించారు.

Next Story