Economy: భారత వృద్ధి అంచనాను పెంచిన ఇక్రా

by S Gopi |

ప్రధానంగా ప్రభుత్వ మూలధన వ్యయం, ఎగుమతులు అధికంగా జరగడం వల్ల వృద్ధికి మరింత సహకారం లభించనుంది.

Economy: భారత వృద్ధి అంచనాను పెంచిన ఇక్రా
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత వృద్ధి అంచనాను పెంచుతున్నట్టు ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి త్రైమాసికంలో దేశ జీడీపీ 6.7 శాతం మేర పెరుగుతుందని ఇక్రా అభిప్రాయపడింది. ఇది భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) అంచనా వేసిన 6.5 శాతం కంటే కొంచెం ఎక్కువ. ప్రధానంగా ప్రభుత్వ మూలధన వ్యయం, ఎగుమతులు అధికంగా జరగడం వల్ల వృద్ధికి మరింత సహకారం లభించనుంది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ప్రభుత్వ పెట్టుబడి ఆర్థిక వృద్ధిని పెంచుతుందని భావిస్తున్నారు. ఇదే సమయంలో అధిక ప్రభుత్వ మూలధన వ్యయం ద్వారా ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని, ఉద్యోగాలను సృష్టి, డిమాండ్ పెరుగుదలకు దోహదపడుతుందని ఇక్రా భావిస్తోంది. దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది దీపావళి నుంచి జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా రేట్ల తగ్గింపు పండుగ సీజన్‌కు ముందు వినియోగాన్ని గణనీయంగా పెంచవచ్చు. భారీ వర్షాలు వ్యవసాయ ఉత్పత్తి, మొత్తం ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేయవచ్చు. కానీ, పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో నెలకొన్న మందగమనాన్ని సేవల రంగం మెరుగైన పనితీరు ద్వారా భర్తీ చేసే అవకాశం ఉంది. కాబట్టి వృద్ధికి ఢోకా ఉండదని ఇక్రా అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పారిశ్రామిక వృద్ధి 6.5 శాతం నుంచి 4 శాతానికి, వ్యవసాయ వృద్ధి 5.4 శాతం నుంచి 4.5 శాతానికి తగ్గొచ్చని అంచనా. అయితే, సేవల రంగం మాత్రం ఎనిమిది త్రైమాసికాల గరిష్ఠ స్థాయి 8.3 శాతానికి పెరుగుతుందని ఇక్రా పేర్కొంది.

Next Story