ICICI Bank: ఏటీఎం లావాదేవీలు, డెబిట్ కార్డు ఛార్జీలను సవరించిన ఐసీఐఐసీఐ బ్యాంక్

by S Gopi |

మెట్రో నగరాల్లో ఇతర బ్యాంకుల్లో ఐసీఐసీఐ బ్యాంకు కార్డు లావాదేవీ ఛార్జీలను బ్యాంకు సవరించింది.

ICICI Bank: ఏటీఎం లావాదేవీలు, డెబిట్ కార్డు ఛార్జీలను సవరించిన ఐసీఐఐసీఐ బ్యాంక్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్ పలు కీలక లావాదేవీలకు సంబంధించి సర్వీస్ ఛార్జీలను సవరించింది. వాటిలో డీడీ, మెట్రో, నాన్-మెట్రో నగరాల్లో ఏటీఎం లావాదేవీలు, డిపాజిట్, విత్‌డ్రా సేవలు, డెబిట్ కార్డు ఫీజులతో సహా వివిధ బ్యాంకింగ్ సేవల్లో ఛార్జీల మార్పులను ప్రకటించింది. సవరించిన ఛార్జీలు ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంకు తెలిపింది. డిమాండ్ డ్రాఫ్ట్(డీడీ)లకు సంబంధించి నగదు, చెక్‌లతో జారీ చేసిన డీడీలకు కొత్త ఛార్జీలు రూ. 1,000కి రూ. 2గా ఉంటాయి. కనీస ఛార్జీ రూ. 50, గరిష్టంగా రూ. 15,000 ఉంటుంది. ఇక, మెట్రో నగరాల్లో ఇతర బ్యాంకుల్లో ఐసీఐసీఐ బ్యాంకు కార్డు లావాదేవీ ఛార్జీలను బ్యాంకు సవరించింది. పరిమితి దాటిన ఆర్థికేతర లావాదేవీలకు రూ. 8.5, ఆర్థిక లావాదేవీలకు రూ. 23 రుసుము అమలవుతుంది.

భారత్ వెలుపల ఏటీఎం నుంచి తీసే డబ్బుకు ఒక్కో లావాదేవీకి రూ. 125 వసూలు చేస్తామని, అదనంగా 3.5 శాతం కరెన్సీ ఎక్స్ఛేంజ్ చెల్లించాలని బ్యాంకు తెలిపింది. ఆర్థికేతర లావాదేవీలకు రూ. 25 రుసుము వర్తిస్తుంది. సీనియర్ సీటిజన్లకు దీన్నుంచి మినహాయింపు ఉంటుందని బ్యాంకు వెల్లడించింది. బ్యాంకుకే చెందిన ఏటీఎంలలో జరిగే లావాదేవీలకు ఒక్కో ఆర్థిక లావాదేవీకి రూ. 23, బ్యాలెన్స్ చెక్, మినీ స్టేట్‌మెంట్, పిన్ మార్పులు సహా అన్ని ఆర్థికేతర లావాదేవీలు ఉచితమని తెలిపింది. సీనియర్ సిటిజన్లకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. చివరగా, సాధారణ డెబిట్ కార్డులకు వార్షిక రుసుము రూ. 300గా బ్యాంకు నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాలలోని వినియోగదారులకు, వార్షిక రుసుము రూ. 150, కార్డు పోయినా లేదా దెబ్బతిన్నా, కార్డును రీప్లేస్ చేయడానికి రూ. 300 రుసుము ఉంటుందని బ్యాంకు పేర్కొంది.

Next Story