Hyundai: కార్లపై రూ. 2.40 లక్షల వరకు తగ్గింపు ప్రకటించిన హ్యూండాయ్

by S Gopi |

హ్యూండాయ్ మోటార్ ఇండియా తన పోర్ట్‌ఫోలియోలోని కార్ల ధరలను గరిష్ఠంగా రూ. 2.40 లక్షల వరకు తగ్గించినట్టు వెల్లడించింది.

Hyundai: కార్లపై రూ. 2.40 లక్షల వరకు తగ్గింపు ప్రకటించిన హ్యూండాయ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జీఎస్‌టీ రేట్ల కోత ప్రయోజనాలను వాహన తయారీ కంపెనీలు కస్టమర్లకు బదిలీ చేయడం ప్రారంభించాయి. ఇప్పటికే టాటా మోటార్స్‌, మహీంద్రా, టయోటా కిర్లోస్కర్, రెనో ఇండియా కంపెనీలు తగ్గింపు వివరాలను వెల్లడించగా, ఇదే బాటలో హ్యూండాయ్ కూడా నిలిచింది. ఆదివారం నాటి అధికారిక ప్రకటనలో హ్యూండాయ్ మోటార్ ఇండియా తన పోర్ట్‌ఫోలియోలోని కార్ల ధరలను గరిష్ఠంగా రూ. 2.40 లక్షల వరకు తగ్గించినట్టు వెల్లడించింది. ఈ తగ్గింపు వెర్నాపై రూ. 60,640 నుంచి ప్రీమియం ఎస్‌యూవీ టక్సన్‌పై రూ. 2.40 లక్షల వరకు ఉంటుందని తెలిపింది. కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుంచి వర్తిస్తాయని పేర్కొంది. జీఎస్టీ సంస్కరణలు వాహన పరిశ్రమకు ఊతమివ్వడమే కాకుండా లక్షలాది మంది కస్టమర్లకు సరసమైన ధరలో వాహనాలు లభిస్తాయని హ్యూండాయ్ మోటార్ ఇండియా ఎండీ ఉన్సూ కిమ్ చెప్పారు. ఇదే సమయంలో దేశీయ వాహనాల తయారీ సంస్థ టాటా మోటార్స్ కమరషియల్ వాహనాల ధరలను కూడా సవరించినట్టు ప్రకటించింది. జీఎస్టీ తగ్గింపు పూర్తి ప్రయోజనాలను వినియోగదారులకు అందిస్తామని కంపెనీ స్పష్టం చేసింది. కంపెనీ తన కమర్షియల్ వాహనాల ధరలను రూ. 30,000 నుంచి రూ. 4.65 లక్షల వరకు తగ్గించినట్టు పేర్కొంది.

Next Story