Philanthropy: దాతృత్వంలో శివ్ నాడార్ మరోసారి నంబర్ 1.. రోజుకు రూ. 7.4 కోట్ల విరాళం

by S Gopi |

ఆయన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ రెండో స్థానంలో నిలవగా, బజాజ్ కుటుంబం మూడో స్థానంలో ఉన్నారు.

Philanthropy: దాతృత్వంలో శివ్ నాడార్ మరోసారి నంబర్ 1.. రోజుకు రూ. 7.4 కోట్ల విరాళం
X

దిశ, బిజినెస్ బ్యూరో: హెచ్‌సీఎల్‌ టెక్నాజీ వ్యవస్థాపకుడు శివ్‌ నాడార్‌ దాతృత్వంలో మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. ఈ ఏడాది ఏడాది ఆయన రూ.2,708 కోట్లు సమాజానికి తిరిగిచ్చారు. అంటే సగటు రోజుకు 7.4 కోట్లు వివిధ దాతృత్వ కార్యక్రమాలకు ఖర్చు చేశారు. ఈ మేరకు ఎడెల్‌గివ్‌ హురున్‌ ఇండియా దాతృత్వ జాబితా-2025ను విడుదల చేసింది. ఈ జాబితాలో ఆయన వరుసగా నాలుగో ఏడాది ముందున్నారు. ఆయన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ రెండో స్థానంలో నిలవగా, బజాజ్ కుటుంబం మూడో స్థానంలో ఉన్నారు. ఎడెల్‌గివ్‌ హురున్ ఇండియా దాతృత్వ జాబితా ప్రకారం, దేశంలోని అగ్రశ్రేణి దాతలు 2025లో మొత్తం రూ. 10,380 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఇది మూడేళ్లలో 85 శాతం పెరిగింది. శివ్ నాడార్, ఆయన కుటుంబం ఐదేళ్లలో నాలుగోసారి అగ్రస్థానాన్ని కొనసాగించింది. టాప్ 10 దాతల నుంచి వచ్చిన విరాళాలు మొత్తం రూ. 5,834 కోట్లుగా ఉంది. ఇది ఈ ఏడాది మొత్తం చేసిన విరాళాల్లో సగానికి పైగా ఉంది.

శివ్ నాడార్ తర్వాత ముఖేష్ అంబానీ కుటుంబం రూ.626 కోట్ల విరాళాలతో రెండవ స్థానంలో ఉంది. ఇది గతేడాదితో పోలిస్తే 54 శాతం ఎక్కువ. అంబానీ కుటుంబం ప్రధానంగా ఆరోగ్య సంరక్షణ, విద్య, గ్రామీణ పురోగతి కోసం రిలయన్స్ ఫౌండేషన్‌ ద్వారా విరాళం అందించింది. వీరి తర్వాత బజాజ్ కుటుంబం(రూ. 446 కోట్లు), కుమార్ మంగళం బిర్లా కుటుంబం(రూ. 440 కోట్లు), గౌతమ్ అదానీ కుటుంబం(రూ. 386 కోట్లు), నందన్ నీలేకని(రూ. 365 కోట్లు), హిందూజా కుటుంబం (రూ. 298 కోట్లు), రోహిణి నీలేకని(రూ. 204 కోట్లు), సుధీర్ మెహతా, సమీర్ మెహతా(రూ. 189 కోట్లు), సైరస్ ఎస్ పూనవల్లా, అదర్ పూనవల్లా(రూ. 173 కోట్లు) టాప్-10 జాబితాలో ఉన్నారు.

Next Story