IDFC First Bank: ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ ఫ్రాడ్ వ్యవహారంలో మాజీ మేనేజరే కీలక సూత్రధారి

by S Gopi |

హర్యానా అవినీతి నిరోధక విభాగం ఈ కేసులో ఇప్పటివరకు మాజీ బ్రాంచ్ మేనేజర్ రిభవ్ రిషి, బ్యాంకు మాజీ రిలేషన్‌షిప్ మేనేజర్ అభయ్, రిభవ్ భార్య స్వాతి సింగ్లా, ఆమె సోదరుడు అభిషేక్ సింగ్లాలను అరెస్టు చేసింది.

IDFC First Bank: ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ ఫ్రాడ్ వ్యవహారంలో మాజీ మేనేజరే కీలక సూత్రధారి
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకులో జరిగిన రూ. 590 కోట్ల భారీ మోసంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బ్యాంకు చండీగఢ్ బ్రాంచ్‌లో జరిగిన ఈ ఫ్రాడ్ వెనుక మాజీ బ్రాంచ్ మేనేజర్ హస్తం ఉందని, హర్యానా ప్రభుత్వ విభాగాల ఖాతాల నుంచి నిధులు మాజీ మేనేజర్ భార్య, బావమరిది నడుపుతున్న కంపెనీకి చెందిన ఖాతాలోకి మళ్లించారనే దిగ్భ్రాంతికరమైన వివరాలు దర్యాప్తులో తేలాయి. హర్యానా అవినీతి నిరోధక విభాగం ఈ కేసులో ఇప్పటివరకు మాజీ బ్రాంచ్ మేనేజర్ రిభవ్ రిషి, బ్యాంకు మాజీ రిలేషన్‌షిప్ మేనేజర్ అభయ్, రిభవ్ భార్య స్వాతి సింగ్లా, ఆమె సోదరుడు అభిషేక్ సింగ్లాలను అరెస్టు చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో బ్యాంకు మాజీ మేనేజరే సూత్రధారి అని అధికారులు గుర్తించారు. బ్యాంకు కార్యకలాపాల్లో అవకతవకలు సృష్టించి ప్రభుత్వ నిధులను అతడు షెల్ కంపెనీలకు మళ్లించినట్టు స్పష్టమైంది. అవినీతి నిరోధక విభాగం డైరెక్టర్ జనరల్ ఎఎస్ చావ్లా మాట్లాడుతూ.. రిభవ్, అభయ్ ఈ కేసులో ప్రధాన నిందితులు. వారిద్దరూ ఆరు నెలల క్రితమే ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు నుంచి తమ ఉద్యోగాలను వీడారని చెప్పారు. రిభవ్ రిషి ప్రస్తుతం ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో పనిచేస్తున్నట్టు పేర్కొన్నారు.

ఎలా చేశారంటే..

2025, సెప్టెంబర్‌లో హర్యానా ముఖ్యమంత్రి గ్రామీణ్ ఆవాస్ యోజన పథకానికి సంబంధించిన నిధుల జమ కోసం ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకుతో పాటు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఆ రాష్ట్ర అధికారులు రెండు అకౌంట్లు తెరిచారు. మొదట్లో ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకులు రూ. 50 కోట్లను, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో రూ. 25 కోట్లు డిపాజిట్ చేశారు. ఆ తర్వాతే బ్రాంచ్ మేనేజర్‌గా ఉన్న రిభవ్ రిషి, రిలేషన్‌షిప్ మేనేజర్ అభయ్, హర్యానా ప్రభుత్వ శాఖ ఖాతాలను దుర్వినియోగం చేశారు. అనధికార లావాదేవీలు నిర్వహించి, సరైన అనుమతి లేకుండా రికార్డులను తారుమారు చేశారు. పెద్ద మొత్తంలో అంటే దాదాపు రూ. 300 కోట్లు ప్రభుత్వానికి చెందినన ఖాతాల నుంచి వీరు స్వస్తిక్ దేశ్ ప్రాజెక్ట్స్ అనే ప్రైవేట్ కంపెనీకి బదిలీ చేశారు. ఈ కంపెనీ రిభవ్ భార్య, ఆమె సోదరుడికి చెందినదని సమాచారం. అక్కడి నుంచి, డబ్బును ఇతర షెల్ కంపెనీలకు తరలించారు. దీనివల్లే ఈ ఫ్రాడ్‌ను వెంటనే గుర్తించడం కష్టమైంది.

అయితే, ప్రభుత్వ పథకానికి సంబంధించిన నిధుల వినియోగంపై హర్యానా రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి ఉత్తర్వులు రాకపోవడంతో ఈ బ్యాంకుల్లోని అకౌంట్లను క్లోజ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో ఖాతాల్లోని సొమ్మును వడ్డీతో కలిపి బదిలీ చేయాలని బ్యాంకులకు లేఖలు పంపారు. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు అకౌంట్లోని సొమ్మును హర్యానా ప్రభుత్వానికి బదిలీ చేసి, ఆ అకౌంట్‌ను క్లోజ్ చేశారు. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ మాత్రం ప్రక్రియను ఆలస్యం చేసింది. దీనిపై బ్యాంకు నుంచి సరైన స్పందన లేకపోవడం విచారణ కమిటీ వేయగా, వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి నిందితులు సొమ్మునంతా షెల్ కంపెనీలకు ట్రాన్స్‌ఫర్ చేశారని తేలింది. బ్యాంకులో జరిగిన నిర్వహణా లోపాలతో అనుమానం ఉన్న లావాదేవీలను పరిశీలించడంతో, ప్రభుత్వ అకౌంట్లలోని మొత్తం రూ. 590 కోట్ల వరకు నిధులను దారి మళ్లించారనే విషయం బయటపడింది.

Next Story