Housing Sales: ఇళ్ల అమ్మకాల్లో దక్షిణాది నగరాల హవా

by S Gopi |

దేశవ్యాప్తంగా ఇతర ప్రధాన నగరాల్లో విక్రయాలు క్షీణించినప్పటికీ, దక్షిణాదిలో పెరగడం గమనార్హం. దీంతో ఈ మూడు నగరాల్లో సంయుక్తంగా మొత్తం 1.33 లక్షల యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి.

Housing Sales: ఇళ్ల అమ్మకాల్లో దక్షిణాది నగరాల హవా
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇళ్ల అమ్మకాల్లో దక్షిణాది నగరాలు జోరుగా ఉన్నాయి. ముఖ్యంగా మూడు ప్రధాన నగరాలు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో గతేడాది ఇళ్ల అమ్మకాలు 15 శాతం పెరిగాయని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ప్రాప్‌టైగర్ గురువారం ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా ఇతర ప్రధాన నగరాల్లో విక్రయాలు క్షీణించినప్పటికీ, దక్షిణాదిలో పెరగడం గమనార్హం. దీంతో ఈ మూడు నగరాల్లో సంయుక్తంగా మొత్తం 1.33 లక్షల యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ప్రధానంగా మెరుగైన సరఫరా, అధిక డిమాండ్ కారణంగానే అధిక విక్రయాలు జరిగాయని ప్రాప్‌టైగర్ వెల్లడించింది. గతేడాది ముంబైకి చెందిన లిస్టెడ్ కంపెనీ ఆరమ్ ప్రాప్‌టెక్ కొనుగోలు చేసిన తర్వాత ప్రాప్‌టైగర్ మొదటిసారి దేశంలోని ప్రధాన ఎనిమిది నగరాల స్థిరాస్తి అమ్మకాలపై డేటాను విడుదల చేసింది. దీని ప్రకారం, మొత్తం ఎనిమిది ప్రధాన నగరాల్లో గతేడాది ఇళ్ల అమ్మకాలు 4,36,992 యూనిట్ల నుంచి 12 శాతం తగ్గి 3,86,365 యూనిట్లకు చేరుకున్నాయి. ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్, పూణే, అహ్మదాబాద్‌లలో నివాస ఇళ్ల అమ్మకాలు తగ్గినప్పటికీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతాలో పెరిగాయి. 2025 ఏడాది మొత్తం ఇళ్ల అమ్మకాలకు మంచి గిరాకీ ఉంది. అయితే, అటు కొనుగోలుదారులు జాగ్రత్తగా వ్యవహరించడం, ఇటు డెవలపర్లు సరైన సమయంలో సరఫరా తీసుకురావడంతో అమ్మకాలు స్థిరంగా కొనసాగాయని ఆరమ్ ప్రాప్‌టెక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఓంకార్ శెట్టి అన్నారు.

హైదరాబాద్‌లో 6 శాతం ఎక్కువ

విడివిడి అమ్మకాల విషయానికొస్తే, మూడు దక్షిణాది నగరాలు రాణించాయి. బెంగళూరులో, ఇళ్ల అమ్మకాలు 48,272 యూనిట్ల నుంచి 13 శాతం పెరిగి 54,414 యూనిట్లకు చేరాయి. చెన్నైలో అమ్మకాలు 16,044 యూనిట్ల నుంచి ఏకంగా 55 శాతం పెరిగి 24,892 యూనిట్లకు చేరుకోగా, హైదరాబాద్‌లో 51,337 యూనిట్ల నుంచి 6 శాతం పెరిగి 54,271 యూనిట్లకు చేరుకున్నాయి. ఈ మూడు దక్షిణాది నగరాలు కలిసి గతేడాది 1,33,577 యూనిట్ల అమ్మకాలను నమోదు చేశాయి, ఇది అంతకుముందు ఏడాది 1,15,653 యూనిట్ల కంటే 15.5 శాతం ఎక్కువ. ఇక, కోల్‌కతాలో అమ్మకాలు 13,605 యూనిట్ల నుంచి 12 శాతం పెరిగి 15,172 యూనిట్లకు చేరుకున్నాయి. అయితే, ముంబై ప్రాంతంలో అమ్మకాలు 1,43,487 యూనిట్ల నుంచి 26 శాతం తగ్గి 1,05,595 యూనిట్లకు పడిపోయాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో అమ్మకాలు 41,029 యూనిట్ల నుంచి 35,711 యూనిట్లకు 13 శాతం క్షీణించాయి. పుణెలో అమ్మకాలు 81,281 యూనిట్ల నుంచి 59,223 యూనిట్లకు 12 శాతం తగ్గాయి. చివరగా, అహ్మదాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు 41,937 యూనిట్ల నుంచి 37,087 యూనిట్లకు 12 శాతం పడిపోయాయి.

Next Story