- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Housing price: జూలై-సెప్టెంబర్‌లో 19 శాతం పెరిగిన ఇళ్ల ధరలు
హైదరాబాద్‌లో ధరలు చదరపు అడుగుకు రూ.6,858 నుంచి రూ.7,750కి పెరిగాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ప్రధాన ఎనిమిది నగరాల్లో ఇళ్ల ధరలు గణనీయంగా పెరిగాయి. అధిక డిమాండ్ కారణంగా ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ధరలు 7-19 శాతం పెరిగినట్టు కన్సల్టెంట్ సంస్థ ప్రాప్‌టైగర్ వెల్లడించింది. ఈ మేరకు బుధవారం టాప్-8 నగరాల్లో ధరల వివరాలను ప్రాప్‌టైగర్ విడుదల చేసింది. డేటా ప్రకారం, దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ధరలు అత్యధికంగా 19 శాతం పెరిగాయి. లగ్జరీ ఆస్తులకు, మౌలిక సదుపాయాలకు గిరాకీ పెరగడం వల్ల అధికంగా ఉన్నాయి. ఈ సంవత్సరం జూలై-సెప్టెంబర్‌లో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో గృహాల సగటు ధర చదరపు అడుగుకు రూ. 8,900కి పెరిగింది, గతేడాది ఇదే సమయంలో చదరపు అడుగుకు రూ. 7,479గా ఉంది. ఇక,, బెంగళూర్‌లో 15 శాతం, హైదరాబాద్‌లో 13 శాతంతో రెండంకెల స్థాయిలో ధరలు పుంజుకున్నాయి. బెంగళూరులో చదరపు అడుగు ధర రూ.7,713 నుంచి రూ.8,870కి, హైదరాబాద్‌లో ధరలు చదరపు అడుగుకు రూ.6,858 నుంచి రూ.7,750కి పెరిగాయి. వీటి తర్వాత అహ్మదాబాద్‌లో ధరలు 7.9 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.4,467 నుంచి రూ.4,820కి చేరుకున్నాయి. చెన్నైలో 9 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.6,581 నుంచి రూ.7,173కి చేరాయి. కోల్‌కతాలో ఇళ్ల ధరలు 8 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.5,611 నుంచి రూ.6,060కి, ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం (ఎంఎంఆర్) చదరపు అడుగుకు రూ.12,383 నుంచి రూ.13,250కి చేరుకుంది. ఇక, పూణేలో ఇళ్ల ధరలు 9 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.7,250కి చేరుకున్నాయి. గతేడాది ఇదే సమయంలో చదరపు అడుగుకు రూ. 6,651గా ఉన్నాయి.






