ఆర్‌బీఐ నిర్ణయంతో ఇళ్ల కొనుగోళ్లకు డిమాండ్: రియల్ ఎస్టేట్ డెవలపర్లు!

by Web Desk |
ఆర్‌బీఐ నిర్ణయంతో ఇళ్ల కొనుగోళ్లకు డిమాండ్: రియల్ ఎస్టేట్ డెవలపర్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) తాజా సమావేశంలో వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించడంతో రియల్ ఎస్టేట్ డెవలపర్స్ సంతోషం వ్యక్తం చేశారు. దీనివల్ల దేశవ్యాప్తంగా నివాస గృహాలకు మరింత గిరాకీ ఉంటుందని చెబుతున్నారు. అలాగే, రానున్న త్రైమాసికాల్లో ఆర్‌బీఐ రేట్లను పెంచే అవకాశం ఉంటుందని, వినియోగదారులు ప్రస్తుతం ఉన్న తక్కువ వడ్డీ రేట్ల అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. ఆర్‌బీఐ నిర్ణయం వల్ల పరిశ్రమకు మరింత ప్రయోజనాలు ఉంటాయని, కొత్తగా ఇంటిని కొనాలనుకునేవారికి ప్రస్తుతం బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలు 6-7 శాతంలోపు వడ్డీకే, గృహ రుణ సదుపాయాన్ని ఇస్తున్నందున ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని డెవలపర్లు చెబుతున్నారు. గత కొద్దిరోజులుగా రిటైల్ ద్రవ్యోల్బణం రెపో రేటు కంటే ఎక్కువగా ఉన్న కారణంగా రానున్న ఆర్‌బీఐ సమావేశాల్లో వడ్డీ రేట్లను పెంచవచ్చని పరిశ్రమల సంఘం నరెడ్‌కో హీరానందాని గ్రూప్ ఎండీ, వైస్-ఛైర్మన్ నిరంజర్ హీరానందాని చెప్పారు. గృహ రుణ వడ్డీ రేట్లు చారిత్రాత్మక కనిష్ఠాల వద్ద ఉన్నాయి. ఇకపై ఈ స్థాయిలో రేట్లు కొనసాగకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే రియల్ ఎస్టేట్ రంగం రికవరీ సాధిస్తోందని, ఆర్‌బీఐ నిర్ణయం ఈ రంగానికి అనుకూలంగా ఉంటుందని ఏబీఏ కార్పొరేషన్ డైరెక్టర్ అమిత్ మోదీ తెలిపారు.


Next Story

Most Viewed