UK Rich List: యూకే రిచ్ లిస్ట్‌లో మళ్లీ హిందూజాలే టాప్

by S Gopi |

ప్రస్తుతం కుటుంబ వ్యాపార బాధ్యతలను ఆయన కుమారులు సంజయ్ హిందూజా, ధీరజ్ హిందూజాలు నిర్వహిస్తున్నారు.

UK Rich List: యూకే రిచ్ లిస్ట్‌లో మళ్లీ హిందూజాలే టాప్
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత సంతతికి చెందిన హిందూజా గ్రూప్ కుటుంబం యూకే సంపన్నుల జాబితాలో మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ‘ది సండే టైమ్స్ రిచ్ లిస్ట్ 2026’ ప్రకారం.. హిందూజా కుటుంబ సంపద 38 బిలియన్ యూరో(మన కరెన్సీలో రూ. 4.26 లక్షల కోట్ల)కు చేరింది. దీంతో వరుసగా ఐదో సంవత్సరం కూడా బ్రిటన్‌లో అత్యంత సంపన్న కుటుంబంగా హిందూజా గ్రూప్ నిలిచింది. వీరి కుటుంబంలోని పెద్ద గోపిచంద్ హిందూజా గతేడాది మరణించిన తర్వాత వచ్చిన తొలి ర్యాంకింగ్ ఇదే కావడం విశేషం. ప్రస్తుతం కుటుంబ వ్యాపార బాధ్యతలను ఆయన కుమారులు సంజయ్ హిందూజా, ధీరజ్ హిందూజాలు నిర్వహిస్తున్నారు. 38 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న హిందూజా గ్రూప్ మొబిలిటీ, బ్యాంకింగ్, డిజిటల్ టెక్నాలజీ, ఎనర్జీ, రియల్ ఎస్టేట్, హెల్త్‌కేర్ వంటి అనేక రంగాల్లో బలమైన ఉనికిని కలిగి ఉంది. సంజయ్ హిందూజా గల్ఫ్ ఆయిల్ ఇంటర్నేషనల్ చైర్మన్‌గా వ్యవహరిస్తుండగా, ధీరజ్ హిందూజా అశోక్ లేలండ్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరగడంతో గడిచిన ఏడాది కాలంలో అశోక్ లేలాండ్ కంపెనీ షేర్లు దాదాపు 40 శాతం పెరిగాయి. హిందూజా కుటుంబ సంపద వృద్ధికి ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటి. అలాగే ఇండస్ఇండ్ బ్యాంకు షేర్లు కూడా ఏడాదిలో 14 శాతం పెరగడం గ్రూప్ ఆర్థిక బలాన్ని మరింత పెంచింది.

యూకే రిచ్ లిస్ట్‌లో భారత సంతతికి చెందిన మరో ప్రముఖ వ్యాపార కుటుంబం రూబెన్ సోదరులు రెండో స్థానంలో కొనసాగారు. డేవిడ్ రూబెన్, సైమన్ రూబెన్ కుటుంబాల సంపద 27.97 బిలియన్ యూరోలు(రూ. 3.13 లక్షల కోట్లు). లండన్‌లోని అడ్మిరల్టీ ఆర్చ్, కేంబ్రిడ్జ్ హౌస్ వంటి ప్రీమియం ప్రాపర్టీలను విలాసవంతమైన హాస్పిటాలిటీ ప్రాజెక్టులుగా అభివృద్ధి చేస్తూ రూబెన్ ఫ్యామిలీ రియల్ ఎస్టేట్ రంగంలో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. మరోవైపు, భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త ప్రకాష్ లోహియా 28వ స్థానానికి చేరగా, అనిల్ అగర్వాల్ మాత్రం 43వ స్థానానికి పడిపోయారు.

Next Story