Hindeburg Research: అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మూసివేత

by S Gopi |

సంస్థ కార్యకలాపాలను మూసేస్తున్నట్టు వెల్లడించి సంచలనం సృష్టించాడు

Hindeburg Research: అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మూసివేత
X

దిశ, బిజినెస్ బ్యూరో: బిలియనీర్ గౌతమ్ అదానీని లక్ష్యంగా భారత స్టాక్ మార్కెట్లతో పాటు అంతర్జాతీయంగా కూడా అలజడి రేపిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ వ్యవస్థాపకుడు నేట్ ఆండర్సన్ గురువారం కీలక ప్రకటన చేశాడు. సంస్థ కార్యకలాపాలను మూసేస్తున్నట్టు వెల్లడించి సంచలనం సృష్టించాడు. 2017లో హిండెన్‌బర్గ్‌ను ప్రారంభించిన ఆండర్సన్ అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి కొద్ది రోజుల ముందు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీనికి సంబంధించి అధికారిక ప్రకటనలో.. 'గడిచిన ఏడాది కాలంగా ఈ అంశంపై కుటుంబంతో పాటు తమ టీమ్‌తో చర్చలు జరిపాను. కంపెనీ ఏర్పాటు సమయంలో నిర్దేశించిన ప్రణాళికలు, ఉద్దేశాలు ముగియడంతో మూసివేయాలనే నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయం వెనుక ఎలాంటి బెదిరింపులు కానీ, వ్యక్తిగత, ఆరోగ్య సంబంధిత కారణాలు లేవని' వివరించాడు.

హెండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ గురించి..

కంపెనీల కార్యకలాపాలపై విశ్ళేషణాత్మక నివేదికలను ప్రచురించే ఉద్దేశ్యంతో ఆండర్సన్ హిందెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థను ఏర్పాటు చేశారు. పెట్టుబడులు, అప్పుల గురించి విశ్లేషిస్తుంది. ప్రధానంగా కంపెనీల్లో జరిగే అవకతవకలు, రహస్య నిర్ణయాలు, చట్టాల ఉల్లంఘనలను గుర్తిస్తుంది. అంతేకాకుండా ఈ కంపెనీ స్టాక్ మార్కెట్లలో షార్ట్ సెల్లింగ్ పద్దతిలో లాభాలను ఆర్జిస్తుంది. ఈ విధానంలో మొదట కంపెనీల షేర్లను ఎక్కువ ధరల వద్ద విక్రయించి, తక్కువ ధరకు కొనుగోలు చేసి లాభాలను సంపాదిస్తుంది.

హిండెన్‌బర్గ్‌ను స్థాపించిన నాథన్ ఆండర్సన్ కంపెనీలకు సవాలు విసిరే స్థాయిలో నివేదికలను విడుదల చేశాడు. కంపెనీల్లోని సమస్యలను పరిశోధించి బయటపెట్టడంలో అతనికి పేరుంది. అమెరికాలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆండర్సన్ కనెక్టికట్ విశ్వవిద్యాలయంలో ఇంటర్నేషనల్ బిజినెస్ అభ్యసించాడు. అక్కడే ప్రపంచ మార్కెట్లు, ఫైనాన్స్ గురించి తెలుసుకున్నాడు. ఇజ్రాయెల్‌లో ఆర్థిక డేటాకు చెందిన ఓ టెక్ సంస్థలో పనిచేశాడు. ఆ ఉద్యోగమే అతడికి ప్రపంచ మార్కెట్‌లను అర్థం చేసుకోవడంలో సహాయపడింది.

అదానీ గ్రూప్‌పై ఆరోపణలు..

పలు కీలక కంపెనీలపై పరిశోధనలు చేసి, అంతర్గత పత్రాల ఆధారంగా, సదరు కంపెనీ ఉద్యోగులతో చర్చించి నివేదికను విడుదల చేసే హిండెన్‌బర్గ్ 2023, జనవరిలో బిలీయనీర్ గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌పై చేసిన ఆరోపణలతో అంతర్జాతీయంగా ఈ కంపెనీ చర్చలోకి వచ్చింది. కంపెనీ షేర్లను కృత్రిమంగా పెంచిందని, విలువైన పెరిగిన అనంతరం షేర్లపై రుణాలు తీసుకున్నట్టు, అకౌంటింగ్ మోసాలకు పాల్పడినట్టు ఆరోపణలు చేసింది. వాటిని అదానీ గ్రూప్ కొట్టిపారేసింది.

Next Story