Gautam Adani: హిండెన్‌బర్గ్ నివేదిక భారతీయ సంస్థలపై దాడి: గౌతమ్ అదానీ

by S Gopi |

బుధవారం కంపెనీ వాటాదారులకు రాసిన లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు.

Gautam Adani: హిండెన్‌బర్గ్ నివేదిక భారతీయ సంస్థలపై దాడి: గౌతమ్ అదానీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలు కేవలం అదానీ గ్రూప్‌ను టార్గెట్ చేసుకోలేదని, అవి భారతీయ కంపెనీలపై చేసిన దాడేనని గౌతమ్ అదానీ అన్నారు. ఇటీవల స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ హిండెన్‌బర్గ్ ఆరోపణలు నిరాధారమని, అదానీ గ్రూప్, దాని కంపెనీలకు క్లీన్‌చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం కంపెనీ వాటాదారులకు రాసిన లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. అదానీ గ్రూప్‌ను బలహీనపరిచేందుకు హిండెన్‌బర్గ్ ఈ రకమైన ప్రయత్నం చేసింది. తమ సంస్థ పునాదులు ధృఢంగా ఉండటంతో సవాళ్లను అధిగమించింది. హిండెన్‌బర్గ్ నివేదిక అదానీ గ్రూప్‌పై విమర్శ మాత్రమే కాదు. అంతర్జాతీయంగా ఎదగాలని కలలు కనే భారతీయ సంస్థల ధైర్యసాహసాలకు ఇది ప్రత్యక్ష సవాలు. అయితే, సెబీ నిర్ణయంతో ఎప్పటిలాగే సత్యం గెలిచిందని అదానీ లేఖలో అన్నారు.

ఈ పరిణామాలతో అదానీ గ్రూప్ ఆశయాన్ని పదును పెట్టడం ద్వారా, మనదేశ భవిష్యత్తు కోసం స్కేల్, వేగం, స్థిరత్వంతో ముందుకెళ్లాలనే బాధ్యత పెరిగిందని లేఖలో పేర్కొన్నారు. ఈ వారం ప్రారంభంలో దర్యాప్తు చుట్టూ ఉన్న అనిశ్చితి తొలగిపోయింది. రెండు సంవత్సరాలకు పైగా మాపై ఉన్న అపరాధ మేఘం తొలగిపోయిందని అదానీ అన్నారు. కాగా, అదానీ గ్రూప్, కంపెనీలపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలను ఈ నెల 18న సెబీ క్లియర్ చేసింది. అదానీ గ్రూప్ కంపెనీల్లో స్టాక్ మానిప్యూలేషన్, అకౌంటింగ్ ఫ్రాడ్ జరిగినట్టు చేసిన ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేసింది.

Next Story