సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేందుకు హిండెన్‌బర్గ్ ఆరోపణలు: గౌతమ్ అదానీ!

by Disha Web Desk 17 |
సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేందుకు హిండెన్‌బర్గ్ ఆరోపణలు: గౌతమ్ అదానీ!
X

న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రారంభంలో అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ అదానీ గ్రూప్‌పై పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దానివల్ల అదానీ గ్రూప్ సంపద సగానికి పైగా కుప్పకూలింది. తాజాగా వాటాదారులకు రాసిన లేఖలో గౌతమ్ అదానీ ఈ అంశంపై స్పందించారు. సంస్థ ప్రతిష్టను దెబ్బతీసే లక్ష్యంతో 'ఉద్దేశపూరిత సమాచారాన్ని' ఇచ్చారని అదానీ లేఖలో పేర్కొన్నారు.

దేశంలోనే అతిపెద్ద ఫాలో-ఆన్-పబ్లిక్(ఎఫ్‌పీఓ) కోసం వెళ్తున్న సమయంలో హిండెన్‌బర్గ్ సంస్థ నివేదికను బహిర్గతం చేసింది. ఇది ఖచ్చితంగా సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేందుకేనని, స్టాక్ ధరలను ఉద్దేశపూర్వకంగా తగ్గించడం ద్వారా లాభాలను ఆర్జించే లక్ష్యంతో చేసిన ఆరోపణలని చెప్పారు. దానివల్ల ఎఫ్‌పీఓ ప్రక్రియను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని కాపాడేందుకు తాము వారి సొమ్ము తిరిగిచ్చామన్నారు.

హిండెన్‌బర్గ్ నివేదిక కారణంగా సంస్థ అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినప్పటికీ సంస్థ అన్ని ఆరోపణలను ఎదుర్కొన్నదని, సుప్రీంకోర్టు నియమించిన కమిటీ కూడా కంపెనీ ఎటువంటి అవకతవకలకు పాల్పడలేదని చెప్పిందన్నారు. కమిటీ నివేదిక ద్వారానే పెట్టుబడిదారుల్లో తిరిగి నమ్మకం పెరిగిందని లేఖలో వివరించారు.

కాగా, ఈ ఏడాది జనవరి మూడో వారంలో హిండెన్‌బర్గ్ నివేదిక అదానీ గ్రూప్ మోసపూరిత లావాదేవీలతో పాటు స్టాక్‌ ధరలను తారుమారు చేసిందని ఆరోపించింది. దాంతో అదానీ గ్రూప్ కోల్పోయిన విశ్వాసాన్ని పొందేందుకు రుణ చెల్లింపులను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Read More..

అదానీ గ్రూప్స్ పై తప్పుడు సమాచారాన్ని లక్ష్యంగా చేసుకున్న హిండెన్‌బర్గ్: గౌతమ్ అదానీ


Next Story

Most Viewed