Hero Motocorp: కొత్త ఈవీ వేరియంట్‌ను విడుదల చేసిన హీరో మోటోకార్ప్

by S Gopi |

'ఘర్ ఘర్ ఈవూటర్' లక్ష్యంతో, ఈవీ స్కూటర్లను మరింత సరసమైన ధరలో అందుబాటులోకి తెస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది

Hero Motocorp: కొత్త ఈవీ వేరియంట్‌ను విడుదల చేసిన హీరో మోటోకార్ప్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ తన ఈవీ విభాగం వీదా బ్రాండ్‌లో కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. వీఎక్స్2 లైనప్‌లో కొత్తగా వీఎక్స్2 గో 3.4 కిలోవాట్ అవర్ ట్రిమ్‌ను సోమవారం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఆవిష్కరించారు. దేశంలోని ప్రతి ఇంటికి ఈవీలు ఉండాలనే లక్ష్యంతో వీదా 'ఘర్ ఘర్ ఈవూటర్' లక్ష్యంతో, ఈవీ స్కూటర్లను మరింత సరసమైన ధరలో అందుబాటులోకి తెస్తున్నట్టు కంపెనీ ఈ సందర్భంగా వెల్లడించింది. ఇందులో భాగంగానే వీఎక్స్2 గో వేరియంట్‌ను లాంచ్ చేశామని కంపెనీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ కౌసల్య నందకుమార్ అన్నారు. 3.4 కిలోవాట్ అవర్ డ్యూయెల్-రిమూవబుల్-బ్యాటరీ సిస్టమ్‌తో వచ్చిన ఈ కొత్త ఈవీ స్కూటర్ ఒకసారి ఛార్జ్ చేసిన తర్వాత 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఎకో, రైడ్ మోడ్‌లలో లభించే ఈ స్కూటర్ గంటకు 70 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్ 27.2 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్‌తో వస్తుందని, దేశీయ రోడ్లను అనుగుణంగా సస్పెన్షన్ ట్యూన్ చేసినట్టు కంపెనీ తెలిపింది. దీని రూ. 1.02 లక్షలు(ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించామని, ఈ నెల నుంచే దేశవ్యాప్తంగా అన్ని వీదా డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది.

Next Story