9-5 జాబ్‌ చేయటంపై హర్ష్ గోయెంకా ఆసక్తికర పోస్టు

by Yella Dhawani Reddy |   (  Updated:2025-07-26 02:08:36  IST  )

ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా (Harsh Goenka) నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఆసక్తికర విషయాలను పంచుకుంటారు.

9-5 జాబ్‌ చేయటంపై హర్ష్ గోయెంకా ఆసక్తికర పోస్టు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్‌పీజీ గ్రూప్‌ ఛైర్మన్‌ హర్ష్‌ గొయెంకా (Harsh Goenka) నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన ఉద్యోగ సమయానికి సంబంధించి షేర్ చేసిన ఓ పోస్టు నెట్టింట ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేయడం జీవితాన్ని కోల్పోయినట్లేనని ఆయన ఈ పోస్టు ద్వారా తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఓ ఉద్యోగిని తన జీవితం మొత్తాన్ని షిప్ట్‌లో గడిపే తీరును వివరించే వీడియోను షేర్ చేశారు.

వీడియోలో ఇంటర్న్‌షిప్‌ కోసం వచ్చిన ఓ విద్యార్థికి ఓ వ్యక్తి ఉద్యోగం ఇస్తాడు. నాలుగు గడుల మధ్య ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిలబడటమే అతడి పని. దీనికి ఓకే చెప్పి ఆ విద్యార్థి ఉద్యోగంలో చేరతాడు. అయితే, అతడి వయసు పెరిగేకొద్దీ అదే పని చేస్తూ ఉంటాడు. జీతం పెరుగుతుంది తప్ప జీవితంలో ఎలాంటి మార్పూ ఉండదు. చివరికి పదవీ విరమణ చేసేవరకు కూడా అతడు అదే కొనసాగిస్తాడు. వీడియో చివరిలో.. ‘9-5 జాబ్ మీ జీవితం మొత్తాన్ని లాగేసుకుంటుంది. ఇంకా ఆలస్యం కాకముందే మేల్కొండి’ అనే సందేశంతో ముగుస్తోంది. ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండకుండా.. మార్పును స్వాగతించాలని గొయెంకా సూచించారు.

ఇక ఈ వీడియోపై నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్లలో వ్యక్తం చేస్తున్నారు. "9-5 షిప్ట్ ఒక ఎరలా ఉంటుంది. అది మన ఊహలను బంధిస్తుంది" అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరొకరు, "మీరు ఎంత ప్రతిభాశాలి అయినా, పదవీ విరమణ తరువాత మీ స్థానాన్ని వెంటనే మరొకరు భర్తీ చేస్తారు. అందుకే జీవితం మొత్తాన్ని ఉద్యోగానికే అంకితం చేయకండి" అన్నారు.

Next Story