- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
GST: సామాన్యులకు జీఎస్టీ ఊరట.. ఇకపై రెండు శ్లాబులే
ఈ దీపావళి నుంచి సామాన్యులపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) భారం తగ్గుతుందని ప్రకటించారు

దిశ, బిజినెస్ బ్యూరో: భారత 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా త్వరలో జీఎస్టీ రేట్లకు సంబంధించి సామాన్యులకు భారీ ఉపశమనం లభించనుంది. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో.. ఈ దీపావళి నుంచి సామాన్యులపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) భారం తగ్గుతుందని, తదుపరి తరం సంస్కరణలు అమలు చేయనున్నట్టు ప్రకటించారు. సాధారణ పౌరులు, రైతులు, మధ్యతరగతి, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈలు)కు ఉపశమనం కల్పించే లక్ష్యంతో జీఎస్టీ సంస్కరణల తదుపరి దశ అవసరమని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. అందులో భాగంగా ప్రస్తుతం నిత్యాసవరాలపై ఉన్న జీఎస్టీ రేట్లను తగ్గిస్తామని, ఇప్పుడున్న 4 శ్లాబుల స్థానంలో రెండు మాత్రమే ఉండేలా చూస్తామని స్పష్టం చేశారు. దీనివల్ల ఈ ఏడాది దీపావళి నాటికి ప్రజలు పండుగ సంతోషాలు రెట్టింపు అవుతాయని మోడీ వెల్లడించారు. ప్రధాని మోడీ వెలువడిన తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జీఎస్టీకి సంబంధించి కీలక ప్రకటన చేసింది. జీఎస్టీలో ఇకమీదట రెండు శ్లాబులు ఉంటాయని, కొన్ని రకాల ఉత్పత్తులకు మాత్రమే ప్రత్యేక రేట్లు ఉంటాయని పేర్కొంది. కొత్త జీఎస్టీ నిర్మాణం ప్రస్తుత 5, 12, 18, 28 శ్లాబ్‌లను భర్తీ చేస్తుంది. వచ్చే నెలలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై మరింత స్పష్టత వెలువడనుంది.
మూడు పిల్లర్లు
'ఆత్మనిర్భర్ భారత్' కోసం కేంద్రం జీఎస్టీలో మరిన్ని సంస్కరణలు తెచ్చేందుకు ప్రతిపాదనలు ఉంచింది. దేశాన్ని స్వావలంబన దిశగా తీసుకెళ్లేందుకు, కేంద్ర ప్రభుత్వం మూడు ప్రధాన పిల్లర్ల ఆధారంగా ఈ జీఎస్టీ సంస్కరణలను తీసుకొచ్చింది.
1. నిర్మాణాత్మక సంస్కరణలు
2. రేట్ల హేతుబద్ధీకరణ
3. జీవన వ్యయం మెరుగుపరచడం
ఈ మూడు కీలక అంశాలకు సంబంధించి ప్రతిపాదనలను ఇప్పటికే మంత్రులకు పంపామని మంత్రిత్వ శాఖ పేర్కొంది. కేంద్ర, రాష్ట్రాల మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ సాధారణ ప్రజలు వాడుతున్న వస్తువుల ధరలు తగ్గించే అంశంపై చర్చిస్తారు. ఇందులో స్టాండర్డ్, మెరిట్ లాంటి రెండు రకాల రేట్లు ఉంటాయి.
సంస్కరణల ప్రయోజనాలు
పన్ను భారం తగ్గడం వల్ల రోజువారీ వినియోగ వస్తువులు సామాన్యులకు మరింత సరసమైన ధరలో లభిస్తాయి. క్రమబద్ధీకరించిన జీఎస్టీ నిర్మాణం ద్వారా వ్యాపారాల నిర్వహణలో సంక్లిష్టతను తగ్గిస్తుంది. అలాగే, పన్ను రేట్ల సంస్కరణల ద్వారా ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయని, అన్ని రంగాల వృద్ధిని ప్రోత్సహించే లక్ష్యానికి అనుగుణంగా పరిస్థితులు ఏర్పడనున్నాయి.






