Finance Ministry: జీఎస్టీ సంస్కరణలు దేశంలోని ప్రతి పౌరుడి విజయం

by S Gopi |

ప్రధాని మోడీ దీపావళి పండుగకు ముందే జీఎస్టీ సంస్కరణలు తీసుకురావాలని సూచించారు

Finance Ministry: జీఎస్టీ సంస్కరణలు దేశంలోని ప్రతి పౌరుడి విజయం
X

దిశ, బిజినెస్ బ్యూరో: జీఎస్టీ సంస్కరణలు దేశంలోని ప్రతి పౌరుడికి లభించిన భారీ విజయమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. చెన్నైలో జరిగిన చెన్నై సిటిజన్స్ ఫోరం నిర్వహించిన 'రైజింగ్ భారత్ కోసం పన్ను సంస్కరణలు' అనే కార్యక్రమంలో మాట్లాడిన నిర్మలా సీతారామన్.. ప్రధాని మోడీ దీపావళి పండుగకు ముందే జీఎస్టీ సంస్కరణలు తీసుకురావాలని సూచించారు. అందుకనుగుణంగానే జీఎస్టీ ప్రయోజనాలు తెచ్చామని, తద్వారా దేశంలో లక్షలాది కుటుంబాలపై భారం తగ్గించామని చెప్పారు. ప్రజల సాధికారత ద్వారా మాత్రమే భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందన్నారు. జీఎస్టీ కింద గతంలో 12 శాతం పన్ను విధించబడిన అన్ని వస్తువులలో 99 శాతం ఇప్పుడు 5 శాతానికి వచ్చాయని తెలిపారు. ఈ సందర్భంగా బీమా రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐలను ప్రతిపాదించే బీమా సవరణ బిల్లును రాబోయే శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంకేతాలిచ్చారు. ఈ ఏడాది యూనియన్ బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి, కొత్త తరం ఆర్థిక రంగ సంస్కరణల్లో భాగంగా బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితిని ప్రస్తుతం ఉన్న 74 శాతం నుంచి 100 శాతానికి పెంచాలని ప్రతిపాదించారు. అలాగే, బీమా చట్టం-1938లోని పలు నిబంధనలను సవరించేందుకు, పెయిడ్-అప్ కేపిటల్‌ను తగ్గించడంతో పాటు కాంపొజిట్ లైసెన్స్ నిబంధన వంటి అంశాలు సవరణల్లో భాగంగా ఉన్నాయి. బీమా రంగంలో ఈ సంస్కరణల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు లభిస్తాయని అన్నారు. ఈ సవరణల ద్వారా పాలసీదారుల ప్రయోజనాలను ప్రోత్సహించవచ్చని, వారి ఆర్థిక భద్రత మెరుగుపడుతుందని, ఆర్థిక వృద్ధితో పాటు ఉపాధి కల్పనకు తాజా సవరణలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

Next Story