LIC: ఎల్ఐసీలో మైనారిటీ వాటాను విక్రయించనున్న ప్రభుత్వం

by S Gopi |

దశలవారీగా ఎల్ఐసీలో ప్రభుత్వం తన హోల్డింగ్‌ విలువను ఆప్టిమైజ్ చేయాలని చూస్తోంది.

LIC: ఎల్ఐసీలో మైనారిటీ వాటాను విక్రయించనున్న ప్రభుత్వం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ దిగ్గజ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీలో ప్రభుత్వం తన వాటాను విక్రయించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. 2027 నాటికి పబ్లిక్ షేర్ హోల్డింగ్‌ను 10 శాతం ఉంచాలనే సెబీ నిబంధనలు ఉండటంతో ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకోనుంది. అయితే, ఎంత మేర వాటాను విక్రయించాలనే దానిపై ఇంకా స్పష్టత రానప్పటికీ, గతంలో వచ్చిన కథనాల ప్రకారం కనీసం 2-3 శాతం మేర ప్రభుత్వం తన వాటాను తగ్గించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యూహాత్మక, దశలవారీగా ఎల్ఐసీలో ప్రభుత్వం తన హోల్డింగ్‌ విలువను ఆప్టిమైజ్ చేయాలని చూస్తోంది. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) మార్గంలో ఎల్ఐసీలో మరికొంత వాటా అమ్మకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, చర్చలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా, 2022, మే నెలలో ఎల్ఐసీ ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయిన సంగతి తెలిసిందే. 3.5 శాతం వాటాకు సమానమైన రూ. 22.13 కోట్ల విలువైన షేర్లను ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. ప్రస్తుతం ప్రభుత్వానికి 96.5 శాతం వాటా ఉండగా, ఇందులో మరో 2-3 శాతం విక్రయించడం ద్వారా రూ. 9,500-14,500 కోట్ల మేర నిధులను సమీకరించనుంది. నిబంధనల ప్రకారం, 2027, మే 16 నాటికి ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థలో ప్రభుత్వం మరో 6.5 శాతం వాటాను తగ్గించాల్సి ఉంది. కొత్తగా విక్రయించే వాటాకు సంబంధించి పరిమాణం, ధర, సమయం త్వరలో వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. ఎల్ఐసీ ప్రస్తుత మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 5.85 లక్షల కోట్లుగా ఉంది. గురువారం సాయంత్రం నాటికి ఎల్ఐసీ షేర్ ధర 2 శాతం క్షీణించి రూ. 926.90 వద్ద ఉంది.

Next Story