EVs: ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం

by S Gopi |

దీని కోసం రూ.2,000 కోట్ల ఖర్చు చేయనుంది.

EVs: ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద కేంద్రం దాదాపు 72,300 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి మార్గదర్శకాలను జారీ చేసింది. దీని కోసం రూ.2,000 కోట్ల ఖర్చు చేయనుంది. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.10,900 కోట్లను కేటాయించిన సంగతి తెలిసిందే. ఉచిత ఛార్జర్లను అందించే నిబంధనకు అంగీకరిస్తే ప్రభుత్వానికి చెందిన కార్యాలయాలు, రెసిడెన్షియల్ కాంప్లెక్సులు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు ఉన్న ప్రదేశాల్లో ఈవీ ఛార్జింగ్ పరికరాలపై 100 శాతం సబ్సిడీ ఇవ్వనున్నారు. నగరాలు, హైవేల వెంట ప్రభుత్వ నిర్వహణలో ఉన్న ప్రదేశాలలో ప్రభుత్వం సెటప్ ఖర్చులలో 80 శాతం, ఛార్జింగ్ పరికరాల ఖర్చులలో 70 శాతం సబ్సిడీని అందిస్తుంది. ఇది రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, బస్ డిపోలు, మెట్రో స్టేషన్లు, మునిసిపల్ పార్కింగ్ స్థలాలు, హైవే టోల్ ప్లాజాల వంటి ప్రదేశాలకు వర్తిస్తుంది. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) ఈవీ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణకు ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ (పీఐఏ)గా పనిచేయనుంది. సబ్సిడీని రెండు దశల్లో ఇవ్వనునారు. నిబంధనలు, పనితీరు ప్రమాణాలను పూర్తి చేసిన తర్వాత నిధులు విడుదలవుతాయి. ఈ పథకంలో భాగంగా పది లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగిన పట్టణ కేంద్రాలు, స్మార్ట్ సిటీలు, మెట్రోతో అనుసంధానం ఉన్న పట్టణాలు, రాష్ట్ర రాజధానులు, అధిక జనసాంద్రత కలిగిన జాతీయ, రాష్ట్ర హైవేలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

Next Story