E Commerce: ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లకు కీలక ప్రతిపాదనలు పంపిన కేంద్రం

by S Gopi |

దీనివల్ల డిజిటల్ మార్కెట్‌ప్లేస్‌లలో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.

E Commerce: ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లకు కీలక ప్రతిపాదనలు పంపిన కేంద్రం
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలోని ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్యాకేజ్‌డ్ వస్తువులు, ఉత్పత్తులకు సంబంధించి 'కంట్రీ ఆఫ్ ఆరిజిన్(వస్తువు తయారైన దేశం)' ఆధారంగా సెర్చ్ చేసే ఫిల్టర్‌ను తప్పనిసరి చేయాలని ప్రతిపాదించింది. దీనివల్ల డిజిటల్ మార్కెట్‌ప్లేస్‌లలో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. వినియోగదారులు ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నప్పుడు ఉత్పత్తుల మూలాన్ని సులభంగా గుర్తించేలా చేయడం ద్వారా సరైన సమాచారం ఆధారంగా కొనుగోలు చేయడానికి వీలవుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వం ఓ ప్రకటనలో డ్రాఫ్ట్ లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్డ్ కమోడిటీస్) (రెండవ) సవరణ నియమాలు-2025 ద్వారా ప్రస్తుత ప్యాకేజింగ్ నియమాలను మార్చాలని యోచిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ ఫీచర్ ద్వారా ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో అవసరమైన సమాచారాన్ని గుర్తించడం మరింత సులభం అవుతుంది. దీనిపై ప్రజాభిప్రాయం కోసం మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో పబ్లిష్ చేసింది. ఈ నెల 22 వరకు అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. 'మేడ్ ఇన్ ఇండియా' ఉత్పత్తులను సులభంగా కనుగొనే వీలు కల్పించడం ద్వారా 'ఆత్మనిబర్భర్ భారత్', 'వోకల్ ఫర్ లోకల్' కార్యక్రమాల లక్ష్యానికి మద్దతు లభిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.

Next Story