- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
FDI: డిఫెన్స్ కంపెనీల్లో విదేశీ పెట్టుబడులకు నిబంధనలు సడలించే యోచనలో కేంద్రం
ప్రభుత్వ అనుమతి అవసరం లేని ఆటోమేటిక్ రూట్ కింద ఇప్పటికే లైసెన్సులు ఉన్న రక్షణ సంస్థలలో విదేశీ కంపెనీలు 49 శాతం వరకు పెట్టుబడి పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ డిఫెన్స్ కంపెనీల్లో విదేశీ సంస్థ పెట్టుబడులకు సంబంధించి నిబంధనలను మరింత సులభతరం చేయాలని కేంద్రం భావిస్తోంది. గతేడాది పాకిస్తాన్‌తో జరిగిన ఘర్షణ నేపథ్యంలో దేశీయ తయారీని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఇందుకు సానుకూలంగా ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ అనుమతి అవసరం లేని ఆటోమేటిక్ రూట్ కింద ఇప్పటికే లైసెన్సులు ఉన్న రక్షణ సంస్థలలో విదేశీ కంపెనీలు 49 శాతం వరకు పెట్టుబడి పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. దీన్ని 74 శాతానికి పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల విదేశీ కంపెనీలు సులభంగా మన రక్షణ రంగ సంస్థల్లో మెజారిటీ వాటాను సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం, కొత్త రక్షణ లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు మాత్రమే విదేశీ కంపెనీలు స్వయంగా 74 శాతం వరకు స్వంతం చేసుకోవడానికి అనుమతి ఉంది. కొత్త నిబంధన ఇప్పటికే లైసెన్సులు ఉన్న కంపెనీలకు వర్తిస్తుంది. ఈ మార్పు ద్వారా స్నేహపూర్వక దేశాల నుంచి రక్షణ కంపెనీలను భారత్‌లో మరింత భారీగా పెట్టుబడి పెట్టడానికి ఆకర్షించే లక్ష్యంతో చేస్తోంది. రాబోయే కొన్ని నెలల్లో కొత్త నిబంధనలు అమలులోకి రావచ్చు. కాగా, గత 25 ఏళ్లలో భారత రక్షణ రంగంలోకి మొత్తం విదేశీ పెట్టుబడుల వాటా 26.5 మిలియన్ డాలర్లు(మన కరెన్సీలో రూ. 240 కోట్ల) వరకు మాత్రమే ఉన్నాయి.






