Silver: వెండి దిగుమతులపై కేంద్రం కఠిన ఆంక్షలు

by S Gopi |

ఇకపై ఈ రకం వెండి దిగుమతులకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. కొన్ని ఉత్పత్తుల విషయంలో ఆర్‌బీఐ నిబంధనలు కూడా వర్తిస్తాయి

Silver: వెండి దిగుమతులపై కేంద్రం కఠిన ఆంక్షలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాలు విధించిన కొద్ది రోజులకే, కేంద్ర ప్రభుత్వం వెండి దిగుమతులపై మరిన్ని కఠిన ఆంక్షలు విధించింది. ఈ మేరకు శనివారం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(డీజీఎఫ్‌టీ) అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం, విలువైన లోహాల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణను మరింత కఠినతరం చేస్తూ.. వెండి కడ్డీలు, శుద్ధి చేయని వెండి, వెండి పొడి వంటి సెమీ-మాన్యుఫ్యాక్చర్డ్ వెండి ఉత్పత్తులను ‘స్వేచ్ఛా దిగుమతి’ జాబితా నుంచి తొలగించి ‘నియంత్రిత దిగుమతి’ కేటగిరీలోకి మార్చింది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి రానున్నట్టు పేర్కొంది. ఇకపై ఈ రకం వెండి దిగుమతులకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. కొన్ని ఉత్పత్తుల విషయంలో ఆర్‌బీఐ నిబంధనలు కూడా వర్తిస్తాయి. దేశంలో పెరుగుతున్న బంగారం, వెండి దిగుమతి బిల్లును నియంత్రించడం, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గించడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

బంగారం దిగుమతుల విషయంలో కూడా కొత్త పరిమితులు అమల్లోకి వచ్చినట్టు సమాచారం. అడ్వాన్స్ ఆథరైజేషన్ (ఏఏ) కింద ఒక్కో లైసెన్సుకు 100 కిలోల వరకు మాత్రమే బంగారం దిగుమతికి అనుమతి ఉంటుంది. కొత్తగా దరఖాస్తు చేసుకునే కంపెనీల తయారీ యూనిట్లను భౌతికంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతులు మంజూరు చేయనున్నారు. ఇక ఇప్పటికే లైసెన్సులు పొందిన ఎగుమతిదారులపై కూడా కఠిన నిబంధనలు అమలు చేయనున్నారు. పాత లైసెన్సుల కింద కనీసం 50 శాతం ఎగుమతులు పూర్తి చేసిన తర్వాతే కొత్త అనుమతులు జారీ చేయనున్నారు. అదనంగా, సుంకం లేకుండా బంగారం దిగుమతి చేసుకునే ఎగుమతిదారులు ప్రతి 15 రోజులకోసారి చార్టర్డ్ అకౌంటెంట్ వెరిఫికేషన్ చేసిన దిగుమతి-ఎగుమతి వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. మే 13న ప్రభుత్వం విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే.

Next Story