Finance Ministry: ఖర్చుల నియంత్రణపై కేంద్రం ఫోకస్

by S Gopi |

ఈ మార్గదర్శకాలు ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎల్ఐసీ వంటి దిగ్గజ సంస్థలకు కూడా వర్తించనున్నాయి.

Finance Ministry: ఖర్చుల నియంత్రణపై కేంద్రం ఫోకస్
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ప్రభుత్వం ఖర్చులను తగ్గించడంపై మరింత దృష్టి సారించింది. తాజాగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థలు, ఆర్థిక సంస్థలు ఖర్చులను తగ్గించే చర్యలను వెంటనే అమలు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎల్ఐసీ వంటి దిగ్గజ సంస్థలకు కూడా వర్తించనున్నాయి. కొత్త ఆదేశాల ప్రకారం, అత్యవసర పరిస్థితులు మినహా అన్ని సమావేశాలు, సమీక్షలు, అధికారిక చర్చలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే నిర్వహించాలి. ముఖ్యంగా ఉన్నతాధికారుల విదేశీ ప్రయాణాలపై కేంద్రం కఠిన నియంత్రణలు విధించింది. చైర్‌పర్సన్‌లు, మేనేజింగ్ డైరెక్టర్లు, సీఈఓలు వీలైనంత వరకు అంతర్జాతీయ సమావేశాలకు వర్చువల్‌గా హాజరు కావాలని కేంద్రం స్పష్టం చేసింది. దీనివల్ల ప్రయాణ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని భావిస్తోంది.

ఇక పర్యావరణహిత రవాణాపై కూడా కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రధాన కార్యాలయాలు, శాఖల్లో అద్దెకు తీసుకునే పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టాలని సంస్థలకు సూచించింది. ఈ చర్యల ద్వారా ఇంధన వ్యయాలు తగ్గడంతో పాటు, ప్రభుత్వ రంగ సంస్థల్లో గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహించాలని కేంద్రం చూస్తోంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, రూపాయి బలహీనత మధ్య ఇటీవల ప్రధాని మోడీ ప్రభుత్వ శాఖలు ఖర్చులు తగ్గించాలని పాటించాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

Next Story