యూఎస్ వీసా కష్టాల వేళ గూగుల్ కీలక నిర్ణయం.. బెంగళూరులో భారీ క్యాంపస్

by Naga Rani Yarlagadda |

టెక్ దిగ్గజమైన Google తన భవిష్యత్ వర్క్ ఫోర్స్ ను ఎక్కడ విస్తరించాలన్నదానిపై కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వీసాల కోసం ఎదురుచూడకుండా.. భారత్ పై మరింత పెట్టుబడి పెట్టేందుకు గూగుల్ సిద్ధమవుతోంది.

యూఎస్ వీసా కష్టాల వేళ గూగుల్ కీలక నిర్ణయం.. బెంగళూరులో భారీ క్యాంపస్
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా H-1B వర్క్ వీసాల నిబంధనలను మరింత కఠినతరం చేసిన విషయం తెలిసిందే. కొత్తగా H1-B వీసా తీసుకోవాలనుకునే ఉద్యోగులు, కంపెనీలు అక్షరాలా లక్ష డాలర్లు చెల్లించాల్సిందే. దీంతో విదేశీ ఉద్యోగులను నియమించుకోవడం అక్కడి కంపెనీలకు కత్తిమీద సాములా మారింది. ఈ నేపథ్యంలో టెక్ దిగ్గజమైన Google తన భవిష్యత్ వర్క్ ఫోర్స్ ను ఎక్కడ విస్తరించాలన్నదానిపై కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వీసాల కోసం ఎదురుచూడకుండా.. భారత్ పై మరింత పెట్టుబడి పెట్టేందుకు గూగుల్ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా Google బెంగళూరులో భారీ విస్తరణకు ప్రణాళికలు రూపొందించినట్లు Bloomberg ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే సుమారు 20 వేల మందికి పైగా ఉద్యోగులకు ఆ కంపెనీలో పనిచేసే అవకాశం లభిస్తుందని బ్లూమ్ బర్గ్ నివేదిక వెల్లడించింది. వైట్ ఫీల్డ్ లోని అలెంబిక్ సిటీ ఈ ప్రాజెక్టుకు కేంద్రంగా నిలవనుంది. బెంగళూరులో ఉన్న ప్రధాన ఐటీ కారిడార్లలో ఇది కూడా ఒకటి.

గూగుల్ మాతృసంస్థ అయిన అల్ఫాబెట్ ఇప్పటికే అక్కడ ఒక ఆఫీస్ ను లీజుకు తీసుకోగా.. మరో రెండు టవర్లకు ఆప్షన్లు పొందింది. సుమారు 24 లక్షల చదరపు అడుగుల్లో మూడు టవర్లు ఉన్నాయి. బ్లూమ్ బర్గ్ నివేదిక ప్రకారం.. 6.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న టవర్.. కొద్ది నెలల్లోనే సంస్థ ఉద్యోగులకు అందుబాటులోకి రానుంది. మిగతా రెండు టవర్ల నిర్మాణం ఏడాది కాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. వీటిలో అల్భాబెట్ అధికారికంగా ఒక టవర్ కు సంబంధించిన లీజు గురించి మాత్రమే వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో సుమారు 14 వేల మంది గూగుల్ ఉద్యోగులు ఉండగా.. వైట్ ఫీల్డ్ క్యాంపస్ పూర్తిస్థాయిలో ప్రారంభమైతే.. గూగుల్ ఇండియా వర్క్ ఫోర్స్ మరింత రెట్టింపు కానుంది. దీనివల్ల గ్లోబల్ కార్యకలాపాల్లో భారత్ కు మరింత ప్రాధాన్యం పెరగుతుందని నిపుణులు చెప్తున్నారు.

బెంగళూరులో గూగుల్ దూకుడు

గత ఏడాది బెంగళూరులో గూగుల్ అతిపెద్ద క్యాంపస్‌ను ప్రారంభించింది. ఇందులో వినోద సదుపాయాలు, భారీ క్యాంటీన్లు ఉన్నాయి. అప్పటి నుంచి నియామకాలు వేగంగా జరుగుతున్నాయి. క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ లీడర్‌షిప్, మెషిన్ లెర్నింగ్, చిప్ డిజైన్, అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ వంటి విభాగాల్లో వందలాది ఉద్యోగాల కోసం గూగుల్ ప్రకటనలు జారీ చేసింది. కొన్ని పోస్టులకు పీహెచ్‌డీ అర్హతలు కూడా నిర్దేశించింది. యూట్యూబ్ కూడా జనరేటివ్ ఏఐ టూల్స్ అభివృద్ధి కోసం భారత్‌లో తన ఇంజినీరింగ్ టీమ్‌ను విస్తరిస్తోంది.

హెచ్-1బీ సమస్యతో భారత్‌కు ఉద్యోగాలు

అమెరికాలో వీసా విధానాల్లో మార్పులు రావడంతో టెక్ కంపెనీలకు పెద్ద సవాలుగా మారింది. ట్రంప్ పాలన కాలంలో హెచ్-1బీ వీసాలపై కఠిన నిబంధనలు అమల్లోకి రావడంతో పాటు, ఒక్కో వీసాకు లక్ష డాలర్ల వరకు ఫీజు పెంచేశారు. దీంతో అమెరికాకు భారతీయ ఇంజినీర్లను పంపించడంకన్నా, భారత్‌లోనే పెద్ద బృందాలను ఏర్పాటు చేసుకోవడం కంపెనీలకు అనుకూలంగా మారింది. ఇది ఖర్చు తగ్గించడమే కాకుండా.. ప్రతిభావంతులను కోల్పోకుండా ఉండేందుకు సహాయపడుతోందనడంలో సందేహం లేదు. ఇది తాత్కాలిక నిర్ణయంగా కాకుండా, దీర్ఘకాలిక వ్యూహంగా మారుతోందని బ్లూమ్ బర్గ్ నివేదిక పేర్కొంది.

ఏఐ రేసులో భారత్ కీలకం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పోటీ పెరుగుతున్న నేపథ్యంలో, భారత్ కీలక కేంద్రంగా మారుతోంది. కేవలం సపోర్ట్ పనులకే కాకుండా, అధునాతన ఇంజినీరింగ్, రీసెర్చ్ కార్యకలాపాలకు కూడా భారత్ ప్రధాన కేంద్రంగా మారుతోంది. గూగుల్‌తో పాటు ఇతర కంపెనీలు కూడా ఇదే దారిలో సాగుతున్నాయి. ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ ఇటీవల భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించి, మాజీ మైక్రోసాఫ్ట్ అధికారి ఇరినా ఘోష్‌ను ఇండియా హెడ్‌గా నియమించింది. “ఏఐ అభివృద్ధిలో భారత్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది” అని ఆమె పేర్కొన్నారు.

టెక్ దిగ్గజాల్లో భారత్ ఉద్యోగాలు పెరుగుతున్నాయి

స్టాఫింగ్ సంస్థ ఎక్స్‌ఫెనో గణాంకాల ప్రకారం.. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, యాపిల్, మెటా, నెట్‌ఫ్లిక్స్ వంటి అమెరికన్ టెక్ కంపెనీల భారత్ ఉద్యోగుల సంఖ్య గత ఏడాదిలో 16 శాతం పెరిగింది. ఇది గత మూడు సంవత్సరాల్లో నమోదైన అతిపెద్ద వృద్ధిగా నిలిచింది. ఈ వృద్ధి వీసా నిబంధనల కారణంగా కంపెనీలు తమ టాలెంట్ పాలసీలను మార్చుకోవడమే ప్రధాన కారణమని ఎక్స్‌ఫెనో సహ వ్యవస్థాపకుడు కమల్ కరంత్ తెలిపారు.

Next Story