- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
EPFO: నెలాఖరులోగా యూపీఐ, ఏటీఎం ఆధారిత పీఎఫ్ విత్‌డ్రా
ఈ విధానం ద్వారా చందాదారులు తమ పీఎఫ్ సొమ్ములో 50 శాతం నుంచి 75 శాతం వరకు నేరుగా వారి ఆధార్-లింక్డ్ బ్యాంక్ ఖాతాలోకి బదిలీ చేసుకోవచ్చు లేదా ఏటీఎం ద్వారా డ్రా చేసుకోవచ్చు.

దిశ, బిజినెస్ బ్యూరో: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) చందాదారులకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, నేరుగా యూపీఐ, ఏటీఎం కార్డ్‌ల ద్వారా డబ్బు తీసుకునే సరికొత్త సదుపాయాన్ని జూన్ నెలాఖరుకల్లా ప్రారంభించడానికి ప్రభుత్వం తుది ఏర్పాట్లు చేస్తోంది. 'ఈపీఎఫ్ఓ 3.0' అప్‌గ్రేడ్‌లో భాగంగా కొత్త 2.01 సర్వర్ అందుబాటులోకి రాగానే ఈ సేవలు లైవ్‌లోకి వస్తాయి. ఈ విధానం ద్వారా చందాదారులు తమ పీఎఫ్ సొమ్ములో 50 శాతం నుంచి 75 శాతం వరకు నేరుగా వారి ఆధార్-లింక్డ్ బ్యాంక్ ఖాతాలోకి బదిలీ చేసుకోవచ్చు లేదా ఏటీఎం ద్వారా డ్రా చేసుకోవచ్చు. అయితే, భవిష్యత్తు అవసరాల కోసం అకౌంట్‌లో కనీసం 25 శాతం బ్యాలెన్స్‌ను తప్పనిసరి రిటైర్మెంట్ ఫండ్‌గా లాక్ చేసి ఉంచుతారు.
రూ. 5 లక్షల వరకు ఆటో-సెటిల్‌మెంట్
కొత్తగా వస్తున్న 'ఈపీఎఫ్ఓ 3.0' వ్యవస్థతో పీఎఫ్ సేవల్లో పేపర్ వర్క్, జాప్యం, ఆఫీసర్ల ప్రమేయం పూర్తిగా తగ్గిపోతాయి. ఇప్పుడు రూ. 5 లక్షల వరకు ఉన్న పీఎఫ్ అడ్వాన్స్ క్లెయిమ్‌లను ఎవరితోనూ అవసరం లేకుండా సిస్టమే ‘ఆటో-సెటిల్‌మెంట్’ ద్వారా వెంటనే ప్రాసెస్ చేస్తుంది. అంతేకాదు, పేరు లేదా ప్రొఫైల్ వివరాల సవరణల కోసం పీఎఫ్ ఆఫీసులకు వెళ్లాల్సిన పనిలేకుండా ఆన్‌లైన్ డిజిటల్ రికార్డ్ సవరణల సౌకర్యం తెస్తున్నారు. ఆధార్ ఆధారిత డిజిటల్ ధృవీకరణ వల్ల ప్రతి చిన్న విషయానికి కంపెనీ యజమాని (ఎంప్లాయర్) పై ఆధారపడాల్సిన అవసరం తప్పుతుంది. అయితే, ఈ కొత్త ఫీచర్లు వాడాలంటే చందాదారులు తమ యూఏఎన్‌కు ఆధార్ లింక్ చేయడం, బ్యాంక్ వివరాలు సరిచూసుకోవడం, పాన్ డేటా ఒకేలా ఉంచుకోవడం వంటి పనులు ముందే పూర్తి చేసుకోవాలి.
ఈ నెలలోనే 8.25 శాతం పీఎఫ్ వడ్డీ జమ
మరోవైపు, దేశంలోని 7 కోట్ల మందికి పైగా ఉన్న పీఎఫ్ చందాదారుల ఖాతాల్లోకి ఈ నెలలోనే వడ్డీ డబ్బులు జమ కానున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) నిర్ణయించిన 8.25 శాతం వడ్డీ రేటుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ఆమోద ముద్ర వేసింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవియా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఖరారైన ఈ వడ్డీ రేటును ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది కూడా కొనసాగించింది. కొత్తగా అప్‌గ్రేడ్ చేసిన టెక్నాలజీ ద్వారా ఈసారి వడ్డీ డబ్బులు ఎలాంటి జాప్యం లేకుండా తక్షణమే ఖాతాల్లో కనిపించనున్నాయి.






