Gold: రూ. 4,000 పెరిగిన బంగారం.. తులం ఇప్పుడు రూ. 1.37 లక్షలు

by S Gopi |

అంతర్జాతీయ పరిణామాలకు తోడు దేశీయ మార్కెట్లో భారీ గిరాకీ కారణంగా ధరలు దూసుకెళ్తున్నాయి.

Gold: రూ. 4,000 పెరిగిన బంగారం.. తులం ఇప్పుడు రూ. 1.37 లక్షలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: బంగారం ధరలు మరోసారి కొత్త రికార్డు గరిష్టాలకు చేరాయి. అంతర్జాతీయ పరిణామాలకు తోడు దేశీయ మార్కెట్లో భారీ గిరాకీ కారణంగా ధరలు దూసుకెళ్తున్నాయి. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర ఒక్కరోజే రూ. 4,000 పెరిగి రూ. 1,37,600కి చేరుకుంది. హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన పది గ్రాముల బంగారం రూ. 1,35,480కి చేరింది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములు రూ. 1,24,100కి పెరిగింది. అంతర్జాతీయ స్పాట్ గోల్డ్ ధర 4,350 డాలర్లకు పెరగడంతో, దేశీయ మార్కెట్‌లోనూ ర్యాలీ కొనసాగిందని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ, కరెన్సీ విభాగం వైస్ ప్రెసిడెంట్, రీసెర్చ్ అనలిస్ట్ జతీన్ త్రివేది అన్నారు. ప్రధానంగా సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారానికి డిమాండ్ పెరుగుతుండటంతో పాటు అమెరికాకు చెందిన నాన్-ఫార్మ్ పెరోల్స్ సహా ఆ దేశ ఆర్థిక డేటాపై అంచనాల కారణంగా ధరలు రికార్డు గరిష్ఠాలకు చేరాయి. ఇప్పుడందరి దృష్టి యూఎస్ ఆర్థిక డేటాపై ఉండటమే ధరల పెరుగుదలను ప్రభావితం చేస్తున్నాయని జతీన్ త్రివేది వివరించారు.

ప్రస్తుత క్యాలెండర్ ఏడాదిలో బంగారం ధరలు ఏకంగా 74.3 శాతం పెరిగాయి. 2024, డిసెంబర్ 31న 10 గ్రాముల పసిడి రూ. 78,950 ఉంది. అంటే ఈ ఏడాదిలో ఇప్పటివరకు బంగారం రూ. 58,650 పెరిగింది. మరోవైపు, వెండి ధరలు రూ. 5,000 పెరిగి రూ. 2,15,000 (అన్ని పన్నులతో కలిపి)కి చేరుకుంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు వెండి కూడా భారీగా పెరిగింది. 2024, డిసెంబర్ 31న కిలో రూ. 89,700 ఉండగా, 122.41 శాతం పెరిగి రూ. 2.15 లక్షలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్ 1.16 శాతం పెరిగి 4,350.06 డాలర్లకు చేరింది. గత ఐదు సెషన్లలో ఔన్స్ బంగారం 3.80 శాతం పెరిగింది. ఔన్స్ వెండి 3.24 శాతం పెరిగి 63.96 డాలర్లకు చేరుకుంది.

Next Story