- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gold: అమెరికా-వెనిజులా ఉద్రిక్తతలతో మళ్లీ పెరిగిన బంగారం ధరలు
గ్లోబల్ మార్కెట్లలో మొదలైన ర్యాలీ ప్రభావం, సోమవారం దేశీయంగా కూడా బంగారం ధరలపై ఒత్తిడి పెంచాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: బంగారం, వెండి ధరలకు మరోసారి రెక్కలొచ్చాయి. ఇప్పటివరకు రకరకాల కారణాలతో రికార్డు గరిష్టాలకు చేరిన బంగారం, వెండి ధరలకు తాజా పరిణామాలు మరింత ఆజ్యం పోశాయి. గతవారాంతం వీటిలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగిన తర్వాత అమెరికా, వెనిజులా సంక్షోభంతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి. ఫలితంగా సురక్షిత సాధనాలైన బంగారం, వెండి, రాగి సహా కమొడిటీస్ ధరలు పుంజుకున్నాయి. గ్లోబల్ మార్కెట్లలో మొదలైన ర్యాలీ ప్రభావం, సోమవారం దేశీయంగా కూడా బంగారం ధరలపై ఒత్తిడి పెంచాయి. దీంతో సాయంత్రానికి దేశ రాజధాని ఢిల్లీలో స్వచ్ఛమైన బంగారం ధరలు 10 గ్రాములు రూ. 1,37,990 వద్ద ఉంది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన పది గ్రాముల బంగారం పది రూ. 2,400 పెరిగి రూ. 1,38,825కి చేరింది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములు రూ. 2,200 పెరిగి రూ. 1,27,164 వద్ద ఉంది. గ్లోబల్ మార్కెట్లలోనూ ఇదే తరహాలో స్పాట్ గోల్డ్ 4,400 మార్కును దాటింది. వెండి సైతం కిలోకు రూ. 7 వేలు పెరిగి రూ. 2,48,000కి చేరింది.
లాభాల స్వీకరణ తర్వాత డిమాండ్
గత వారం ట్రేడర్లు బంగారం, వెండి వంటి లోహాల నుంచి అధిక మొత్తం లాభాలను స్వీకరించడంతో, బంగారం 4 శాతం కంటే ఎక్కువగా బలహీనపడింది. కానీ, డిసెంబర్ 3న అమెరికా సైనికులు వెనిజులా అధ్యక్షుడిని బంధించిన తర్వాత ఆ దేశంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ వేగంగా మారింది. బంగారం లాంటి సురక్షిత ఆస్తుల్లో పెట్టుబడులకు గిరాకీ ఒక్కసారిగా పుంజుకుందని విశ్లేషకులు పేర్కొన్నారు.
భౌగోళిక రాజకీయాల ప్రభావం
పెట్టుబడిదారులు ఇప్పటికే అస్థిరంగా మారిన అంతర్జాతీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బంగారం వంటి కమొడిటీస్‌లో ఎక్కువ నిధులను బదిలీ చేస్తున్నారు. విలువైన లోహాలు, ముఖ్యంగా బంగారం ఎక్కువ భౌగోళిక రాజకీయ అనిశ్చితి సమయంలో ఎక్కువ డిమాండ్‌ను చూస్తాయి. తాజా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరింత ఎక్కువగా బంగారంలో పెట్టుబడులను ఆకర్షించవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.






