- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Old Jewellery: రికార్డు ధరల తర్వాత యూటర్న్
సోమవారం ఉదయం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1,42,730 వద్ద ట్రేడవుతోంది. ఇది ఈ మధ్యకాలంలోనే నమోదైన గరిష్ఠ స్థాయి కంటే చాలా తక్కువ.

దిశ, బిజినెస్ బ్యూరో: కొన్ని నెలల క్రితం వరకూ బంగారం కొనాలంటే భయపడిన ప్రజలు.. ఇప్పుడు అదే బంగారాన్ని అమ్మేందుకు జ్యువెలరీ స్టోర్స్ వద్ద క్యూ కడుతున్నారు. ఇటీవల రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు క్రమంగా తగ్గడమే దీనికి కారణం. ధరలు మరింత పడిపోతాయనే అంచనాలతో, ఇప్పుడే మంచి ధర దొరుకుతుండగానే పాత ఆభరణాలను నగదుగా మార్చుకోవాలని చాలామంది భావిస్తున్నారు. సోమవారం ఉదయం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1,42,730 వద్ద ట్రేడవుతోంది. ఇది ఈ మధ్యకాలంలోనే నమోదైన గరిష్ఠ స్థాయి కంటే చాలా తక్కువ. ధరలు రూ.1.20 లక్షల వరకు పడిపోవచ్చన్న అంచనాలు మార్కెట్‌లో వినిపిస్తుండటంతో అమ్మకాలు పెరుగుతున్నాయి.
మార్కెట్లోకి 50 టన్నుల పాత బంగారం
ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) అంచనా ప్రకారం, ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారతీయ కుటుంబాలు దాదాపు 50 టన్నుల పాత బంగారాన్ని విక్రయించాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 43 శాతం ఎక్కువ. రికార్డు స్థాయి ధరల సమయంలో లాభాలను సొంతం చేసుకోవాలని చాలామంది భావించడం ఇందుకు ప్రధాన కారణమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. బంగారం ధరలు గరిష్ఠానికి చేరిన ఈ సమయంలో నగదు అవసరాల కోసం, అలాగే భవిష్యత్తులో ధరలు తగ్గిపోతాయనే ఆందోళనతో ప్రజలు తమ వద్ద ఉన్న పాత బంగారాన్ని విక్రయిస్తున్నారని ఐబీజేఏ జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా చెప్పారు.
గ్లోబల్ మార్కెట్ ఒత్తిడి కూడా
దేశీయ మార్కెట్ మాత్రమే కాదు... అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలపై ఒత్తిడి కొనసాగుతోంది. అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలతో ముడి చమురు ధరలు పెరగడం, మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం లేకపోవడం బంగారంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. సాధారణంగా వడ్డీ రేట్లు పెరిగినప్పుడు బంగారానికి డిమాండ్ తగ్గుతుంది. ఎందుకంటే బంగారం నుంచి వడ్డీ రూపంలో ఆదాయం ఉండదు. దీంతో పెట్టుబడిదారులు ఇతర వడ్డీ ఇచ్చే పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతారు.
రీసైక్లింగ్ పరిశ్రమకు ఊపిరి
పాత బంగారం అమ్మకాలు పెరగడం వల్ల దేశంలోని వ్యవస్థీకృత గోల్డ్ రీసైక్లింగ్ రంగానికి కూడా ఊతం లభిస్తోంది. ఇళ్లలో, బ్యాంకు లాకర్లలో సంవత్సరాలుగా వాడకుండా ఉన్న ఆభరణాలు ఇప్పుడు అధికారిక రీసైక్లింగ్ వ్యవస్థలోకి వస్తున్నాయి. వాటిని శుద్ధి చేసి మళ్లీ జ్యువెలరీ తయారీదారులకు అందిస్తున్నారు. ముత్తూట్ ఎగ్జిమ్ సంస్థ తన 100కు పైగా గోల్డ్ పాయింట్లలో పాత బంగారం కొనుగోళ్లు 40 శాతం పెరిగినట్లు సంస్థ సీఈఓ కీయుర్ షా వెల్లడించారు.
మన ఆర్థికవ్యవస్థకు ఎందుకు కీలకం?
ప్రపంచంలో అత్యధికంగా బంగారం వినియోగించే దేశాల్లో మనదేశం ఒకటి. అయితే అవసరమైన బంగారంలో ఎక్కువ భాగాన్ని విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ దాదాపు 72.4 బిలియన్ డాలర్ల(రూ. 6.84 లక్షల కోట్ల) విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంది. పరిశ్రమ వర్గాల అంచనాల ప్రకారం, 2025లో రీసైక్లింగ్ ద్వారా 125-150 టన్నుల బంగారం మార్కెట్‌లోకి రాగా.. ప్రస్తుత ధోరణి కొనసాగితే ఈ ఏడాది అది 200-250 టన్నులకు పెరిగే అవకాశం ఉంది.
భారతీయ కుటుంబాల వద్ద దాదాపు 30 వేల టన్నుల బంగారం ఉన్నట్లు అంచనా. ఈ బంగారంలో కొంత భాగమైనా రీసైక్లింగ్ ద్వారా మార్కెట్‌లోకి వస్తే దిగుమతులపై ఆధారపడటం తగ్గడంతో పాటు భారత విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి కూడా తగ్గే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పుడు బంగారం అమ్మేయాలా?
ఇటీవల కనిపిస్తున్న అమ్మకాల జోరు చూస్తే చాలా కుటుంబాలు రికార్డు ధరలను లాభంగా మార్చుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. అయితే కేవలం ధరలు పెరిగాయి లేదా తగ్గుతున్నాయనే కారణంతో బంగారం అమ్మేయడం సరైన నిర్ణయం కాదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. వ్యక్తిగత ఆర్థిక అవసరం, పెట్టుబడి లక్ష్యం, భవిష్యత్తు ప్రణాళికలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.






