Gold: రూ. లక్ష దాటనున్న బంగారం

by S Gopi |

బంగారం ధరలు ఔన్స్‌కు 3,500 డాలర్లను దాటవచ్చని, ఇది ప్రస్తుతం ఉన్న ధరల కంటే దాదాపు 13 శాతం అధికమని తెలిపింది.

Gold: రూ. లక్ష దాటనున్న బంగారం
X

దిశ, బిజినెస్ బ్యూరో: బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే సరికొత్త రికార్డు గరిష్ఠాలకు చేరిన పసిడి రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందనే విశ్లేషకుల అంచనా సామాన్యులను మరింత భయపెడుతోంది. ప్రపంచ అనిశ్చితులు, పెట్టుబడుల డిమాండ్ కారణంగా రాబోయే ఏడాదిన్నర కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఔన్స్‌కు 3,500 డాలర్ల మార్కును దాటవచ్చని, ఇది ప్రస్తుతం ఉన్న ధరల కంటే దాదాపు 13 శాతం అధికమని బోఫా సెక్యూరిటీస్ తెలిపింది. వివిధ పరిణామాల మధ్య దేశీయంగా కూడా బంగారం ధరలు త్వరలో రూ. లక్ష మార్కును అధిగమించవచ్చని అంచనా. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాల చుట్టూ నెలకొన్న ఆందోళనలు, యూఎస్ డాలర్‌ను ప్రభావితం చేయవచ్చని, ఫలితంగా మరికొన్ని నెలల పాటు బంగారం ధరల పెరుగుదలకు కారణమవుతుందని బోఫా సెక్యూరిటీస్ పేర్కొంది.

గడిచిన ఏడాది కాలంగా రికార్డు స్థాయిలో బంగారం ధరలు పెరిగాయి. 2024, మార్చి 28న బంగారం ధరలు 10 గ్రాముల రూ. 67,000 వద్ద ఉన్నాయి. ప్రస్తుతం ఇది రూ. 93,000 స్థాయికి చేరుకుంది. అయితే, భౌగోళిక రాజకీయ పరిణామాలు, అనేక దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోలును కొనసాగిస్తుండటం, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల కోత బంగారం ధరల పెరుగుదలకు ఆజ్యం పోస్తున్నాయి. ఈ పరిస్థ్తితులు ఇలాగే కొనసాగడమే కాకుండా ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో బంగారం నిల్వలు పెరుగుతుండటం ధరల పెరుగుదలకు దోహదపడుతున్నాయి. వీటితో పాటు సెంట్రల్ బ్యాంకుల వడ్డీ రేట్లు మరింత తగ్గితే, అమెరికా డాలర్‌లో బలహీనత కొనసాగితే బంగారానికి డిమాండ్ ఇంకా పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధి నెమ్మదిస్తే పెట్టుబడిదారులు సురక్షిత సాధనంగా బంగారంలో పెట్టుబడికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ప్రస్తుత అంచనాలు, మార్కెట్ పరిస్థితుల వల్ల దేశంలో బంగారం ధరలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 10 గ్రాములకు రూ. లక్ష చేరుకోవచ్చని విశ్లేషకులు పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రానికి హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన పది గ్రాముల పసిడి రూ. 930 పెరిగి రూ. 92,840 వద్ద ఉంది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం రూ. 850 పెరిగి రూ. 85,100 వద్ద ఉంది.

Next Story