ICRA: బంగారం అమ్మకాలు తగ్గినా వినియోగంలో మాత్రం రెండంకెల వృద్ధి

by S Gopi |

ధరల పెరిగినా సరే వినియోగంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.

ICRA: బంగారం అమ్మకాలు తగ్గినా వినియోగంలో మాత్రం రెండంకెల వృద్ధి
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో బంగారం ధరలు ఇప్పటికే రికార్డు స్థాయికి చేరాయి. ఈ ఏడాదిలో కూడా ఈ ధోరణి కొనసాగుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తానా నివేదికలో తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విలువ పరంగా బంగారం వినియోగం కనీసం 12-14 శాతం మేర వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. ధరల పెరిగినా సరే వినియోగంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. రిటైల్ విభాగంలో జరుగుతున్న విస్తరణ, అసంఘటిత రంగం నుంచి పెరుగుతున్న లాభాల కారణంగా వినియోగానికి ఢోకా ఉండదని ఇక్రా సీనియర్ వైస్-ప్రెసిడెంట్ జితిన్ మక్కర్ అన్నారు. పెరుగుతున్న ధరల వల్ల ప్రజలు వినియోగం తగ్గించినప్పటికీ, ఈ ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ వేడుకలు, శుభ దినాలు ఉన్న కారణంగా డిమాండ్‌ స్థిరంగా కొనసాగుతుందని ఇక్రా అభిప్రాయపడింది. 2024-25లో బంగారు ఆభరణాల వినియోగం విలువలో 28 శాతం పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కూడా ఇదే తరహా పెరుగుదల నమోదయ్యే అవకాశం ఉంటుందని ఇక్రా స్పష్టం చేసింది. ఇక, బంగారు కడ్డీ, నాణెల వాడకం కూడా మెరుగ్గా ఉంది. గత ఆర్థిక సంవత్సరం బంగారు కడీల వినియోగం 17 శాతం, నాణెల వినియోగం 25 శాతం మేర పెరిగాయని ఇక్రా తెలిపింది. ఇది ప్రధానంగా అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య సమస్యల వల్ల ఎక్కువమంది సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారాన్ని ఎంచుకుంటున్నారు. ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరం బంగారం కడ్డీలు, నాణెల డిమాండ్ 10 శాతం వరకు పెరుగుతుందని ఇక్రా పేర్కొంది.

Next Story