- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gold Imports: అక్టోబర్‌లో 200 శాతం పెరిగిన బంగారం దిగుమతులు
అక్టోబర్ నెలలో పసిడి దిగుమతులు ఏకంగా 200 శాతం పెరిగాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది దీపావళి సహా పండుగ సీజన్ బంగారం గిరాకీ ఎక్కువగా ఉండటం, అధిక ధరల కారణంగా అక్టోబర్ నెలలో పసిడి దిగుమతులు ఏకంగా 200 శాతం పెరిగాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుండటంతో ధరలు అధికంగానే ఉన్నాయని, ఫలితంగా డిమాండ్ నెమ్మదించే అవకాశాలు ఉన్నట్టు ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. వెండి దిగుమతులు గణనీయంగానే పెరిగాయని, ఈ రెండు విలువైన లోహాల దిగుమతుల కారణంగా అక్టోబర్ నెలలో దేశ వాణిజ్య లోటు అత్యధికంగా 41.68 బిలియన్ డాలర్ల(రూ. 3.7 లక్షల కోట్ల)కు చేరింది. ఈ మేరకు సోమవారం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల్లో పేర్కొంది. గత నెలలో దేశీయంగా బంగారం దిగుమతులు 14.72 బిలియన్ డాలర్లు(రూ. 1.30 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. 2024, అక్టోబర్‌లో ఇవి కేవలం రూ. 43.6 వేల కోట్ల దిగుమతులు మాత్రమే జరిగాయి. వెండి దిగుమతులు కూడా రూ. 3,810 కోట్ల నుంచి ఈ ఏడాది అక్టోబర్‌లో రూ. 24 వేల కోట్లకు పైగా పెరిగాయి. ఇక, మొత్తం దేశ ఎగుమతులకు సంబంధించి గత నెలలో 11.8 శాతం తగ్గి 34.38 బిలియన్ డాలర్ల(రూ. 3.04 లక్షల కోట్ల)కు చేరుకున్నాయి. అయితే, దిగుమతులు 16.63 శాతం పెరిగి 76.06 బిలియన్ డాలర్ల(రూ. 6.74 లక్షల కోట్ల)కు చేరుకున్నాయి. దీంతో వాణిజ్య లోటు 41.68 బిలియన్ డాలర్ల(రూ. 3.7 లక్షల కోట్ల)కు పెరిగింది. వాణిజ్య లోటు పెరగడానికి బంగారం, వెండి దిగుమతులు అధికంగా జరగడమ్నని అధికారులు పేర్కొన్నారు.






