Gold: రికార్డు స్థాయిల నుంచి బంగారం, వెండి ధరలు పడిపోతాయా?

by S Gopi |   (  Updated:2025-10-07 13:22:07  IST  )

బంగారం ధరలు కనీసం 30-35 శాతం క్షీణించవచ్చు. 2007-08, 2011 సమయంలో కూడా భారీ ర్యాలీ తర్వాత బంగారం ధరలు 45 శాతం పడిపోయాయి.

Gold: రికార్డు స్థాయిల నుంచి బంగారం, వెండి ధరలు పడిపోతాయా?
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్నాయి. గత కొంతకాలంగా ఈ రెండు విలువైన లోహాలు రోజుకొక రికార్డు గరిష్ఠాలను తాకుతూ, సామాన్యులు కొనలేని స్థాయికి చేరుకున్నాయి. అయితే, ఇటీవల పెరుగుతున్న ధరలు బబుల్ లాంటివని, ఏ సమయంలోనైనా పేలిపోవచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబోయే నెలల్లో బంగారంలో పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారులు భారీ నష్టాలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ వెల్త్ మేనేజ్‌మెంట్ సంస్థ పేఎస్ 360 సీఈఓ అమిత్ గోయెల్ అన్నారు. బంగారం, వెండి ధరలు రెండూ రికార్డు స్థాయి నుంచి దిద్దుబాటుకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలామంది ఆర్థికవ్యవస్థ వృద్ధి నెమ్మదిస్తుందనే సందేహం వచ్చినప్పుడు బంగారం, వెండి లాంటి సురక్షితమైన పెట్టుబడి సాధనాలను ఎంచుకుంటారు. కానీ ఇప్పుడు, బంగారం, వెండికి ఉన్న మంచి రోజులు ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

ధరలు చాలా వేగంగా పెరిగాయి, మార్కెట్ పరిస్థితులు మారితే అంతే స్థాయిలో తగ్గవచ్చు. పరిస్థితులు తారుమారైతే బంగారం ధరలు కనీసం 30-35 శాతం క్షీణించవచ్చు. 2007-08, 2011 సమయంలో కూడా భారీ ర్యాలీ తర్వాత బంగారం ధరలు 45 శాతం పడిపోయాయి. ఈసారి కూడా అలాంటి పరిస్థితి ఎదురుకావొచ్చు. బహుశా ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలం ధరల పతనం కొనసాగే అవకాశం ఉందని, వెండి కూడా 50 శాతం మేర పడిపోయే అవకాశం లేకపోలేదని అమిత్ గోయెల్ వివరించారు.

ఇటీవల బంగారంతో పాటు వెండి కూడా చాలా వేగంగా పెరిగింది. దీనికి కారణం చాలా మంది పెట్టుబడిదారులు ఒక్కసారిగా కొనుగోళ్లకు ఆసక్తి చూపడం. కానీ డిమాండ్‌లో మార్పులు లేదా ప్రభుత్వ విధానాల్లో ఊహించని పరిణామాలు ఎదురైతే ఎక్కువమంది అమ్మకాలకు దిగవచ్చు. తద్వారా ధరలు ఒక్కసారిగా తగ్గుతాయి. ధరలు తగ్గేందుకు మరో పెద్ద కారణం వడ్డీ రేట్లు. అమెరికా ఫెడ్ సహా వివిధ సెంట్రల్ బ్యాంకులు రేట్ల కోత విషయంలో పెంచడం లేదా తగ్గించం కాకుండా స్థిరంగా ఉంచాలని నిర్ణయం తీసుకుంటే, బంగారం, వెండికి గిరాకీ పడిపోవచ్చు. డాలర్ కరెన్సీ బలపడటం, ఇతర సాధనాల్లో అధిక రాబడి వస్తే పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను బంగారం, వెండి నుంచి ఇతర మార్గాలకు తరలించేలా అవకాశం ఉంది. కాబట్టి, ధరలు పెరిగిపోతున్నాయనే ఆందోళణలో బంగారం, వెండి కొనేవారు జాగ్రత్త వహించాలని అమిత్ గోయెల్ సూచించారు.

Next Story