- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
WTO: ట్రంప్ టారిఫ్ కారణంగా ప్రపంచ వాణిజ్యంలో క్షీణత
ఇది ఇదివరకు అంచనా వేసిన 2.7 శాతం కంటే గణనీయమైన తగ్గుదల.

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన పరస్పర సుంకాల ప్రభావం కారణంగా ప్రపంచ వాణిజ్యం గణనీయంగా ప్రభావితమవుతుందని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్(డబ్ల్యూటీఓ) వెల్లడించింది. ప్రస్తుతానికి ట్రంప్ టారిఫ్ అమలును 90 రోజుల పాటు తాత్కాలిక విరామం ప్రకటించినప్పటికీ ఈ ఏడాది ప్రపంచ సరుకుల రవాణా 0.2 శాతానికి తగ్గవచ్చని డబ్ల్యూటీఓ అభిప్రాయపడింది. ఇది ఇదివరకు అంచనా వేసిన 2.7 శాతం కంటే గణనీయమైన తగ్గుదల. 90 రోజుల విరామం అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఈ అంచనాను వెల్లడిస్తున్నట్టు డబ్ల్యూటీఓ పేర్కొంది. ఒకవేళ గడువు తర్వాత సుంకాలను అమలు చేస్తే ప్రపంచ వాణిజ్య వృద్ధి అదనంగా మరో 0.6 శాతం తగ్గుతుంది. తద్వారా అమెరికా పరస్పర సుంకాలు, ఫలితంగా ఇతర దేశాలు కూడా ప్రతీకార సుంకాలను ప్రకటిస్తే ఈ క్షీణత 1.5 శాతం మేర ఉంటుందని గ్లోబల్ ట్రేడ్ ఔట్‌లుక్ అండ్ డేటా నివేదికలో డబ్ల్యూటీఓ పేర్కొంది. అయితే, ఆ తర్వాత పరిస్థితులు మెరుగుపడి 2026లో ప్రపంచ వాణిజ్యం 2.5 శాతం వృద్ధితో రికవరీ అవగలదని వెల్లడించింది. సేవల రంగంపై నేరుగా టారిఫ్ ప్రభావం ఉండకపోయినా, ప్రతికూల ప్రభావం మాత్రం తప్పదు. సేవల ఎగుమతులు 2025లో 4 శాతం, 2026లో 4.1 శాతం పెరుగుతుందని అంచనా. విలువ పరంగా ప్రపంచ సరుకుల ఎగుమతులు గతేడాది 2 శాతం పెరిగి 24.43 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇదే సమయంలో ప్రపంచ సేవల ఎగుమతులు 9 శాతం వృద్ధితో 8.69 ట్రిలియన్ డాలర్లకు పెరిగాయని డబ్ల్యూటీఓ నివేదిక పేర్కొంది.






