అంతర్జాతీయ ఉద్రిక్త పరిస్థితులే భారత వృద్ధికి విఘాతం: RBI ఎంపీసీ సభ్యుడు!

by Disha Web Desk 17 |
అంతర్జాతీయ ఉద్రిక్త పరిస్థితులే భారత వృద్ధికి విఘాతం: RBI ఎంపీసీ సభ్యుడు!
X

న్యూఢిల్లీ: భారత వృద్ధికి అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు అతిపెద్ద ప్రమాదంగా మారాయని ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ(ఎంపీసీ) కమిటీ సభ్యుడు జయంత్ ఆర్ వర్మ అన్నారు. ముఖ్యంగా ఈ ఉద్రిక్తతలు ఆసియా ప్రాంతానికి కూడా విస్తరిస్తే భారత వృద్ధికి మరింత విఘాతం ఏర్పడుతుందని ఆయన బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

దేశవ్యాప్తంగా ధరలు దిగొస్తున్న తరుణంలో అధిక ద్రవ్యోల్బణం ఎక్కువ కాలం కొనసాగే అవకాశం లేదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మరికొన్ని త్రైమాసికాల పాటు అధిక ద్రవ్యోల్బణం కొనసాగినప్పటికీ వృద్ధికి ఇబ్బంది లేకుండా నిర్దేశించిన లక్ష్యం 4 శాతం కంటే తక్కువకు తెచ్చేలా ఆర్‌బీఐ పని చేస్తోందని ఆయన వివరించారు. ఇప్పటికే ధరలు గరిష్ట స్థాయిని తాకాయి. కాబట్టి పరిస్థితులు సానుకూలంగా ఉంటాయని, అలాగే, దేశీయంగా మహమ్మారి తగ్గిన తర్వాత అన్ని రంగాలు, పరిశ్రమల్లో రికవరీ సమానంగా లేకపోయినా, డిమాండ్ కోలుకుంటోంది.

ఉత్పత్తి, సేవల రంగాల్లో సామర్థ్యం పుంజుకుంటుందని, ఈ సమయంలోనే కంపెనీలు మూలధన వ్యయాన్ని పెంచుతూ విస్తరణ ప్రారంభించాల్సిన అవసరం ఉందని జయంత్ వర్మ అభిప్రాయపడ్డారు. కరోనా ప్రభావం నుంచి కోలుకుంటున్న సమయంలో భారత వృద్ధికి ద్రవ్యోల్బణం కారణంగా ఇబ్బందులెదురయ్యాయి. దీనికితోడు భౌగోళిక రాజకీయ పరిస్థితుల వల్ల భారత ఎగుమతులు నెమ్మదించే అవకాశాలున్నాయి. ఈ రెండు అంశాలను పరిగణలోకి తీసుకుని ఆర్‌బీఐ తగిన చర్యలు తీసుకుంటోందని జయంత్ వెల్లడించారు.



Next Story