Nitin Gadkari: డీజిల్, పెట్రోల్‌ ఇంజిన్లకు భవిష్యత్తు లేదు: నితిన్ గడ్కరి

by S Gopi |

విదేశాల నుంచి ఇంధనం కొనుగోలు చేయడం వల్ల డబ్బు వృధా అవుతోందని, పైగా కాలుష్యం కూడా పెరుగుతోందని అన్నారు.

Nitin Gadkari: డీజిల్, పెట్రోల్‌ ఇంజిన్లకు భవిష్యత్తు లేదు: నితిన్ గడ్కరి
X

దిశ, బిజినెస్ బ్యూరో: శిలాజ ఇంధన ఆధారిత రవాణా నుంచి తొందరగా బయటపడాలని కేంద్ర కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. డీజిల్, పెట్రోల్ ఇంజిన్లకు 'భవిష్యత్తు లేదు' అని, ఆటోమొబైల్ పరిశ్రమ ఖర్చు కంటే నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. విదేశాల నుంచి ఇంధనం కొనుగోలు చేయడం వల్ల డబ్బు వృధా అవుతోందని, పైగా కాలుష్యం కూడా పెరుగుతోందని అన్నారు. అందుకే బయోఫ్యూయల్ వంటి స్వదేశీ, స్వచ్ఛమైన ఇంధనాల వైపు మళ్ళడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఇంధనాలకు మారడం అనివార్యమని గడ్కరీ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం రవాణాను ఆధునీకరిస్తూ, ప్రజా రవాణా మౌలిక సదుపాయాలను విస్తరిస్తోంది. ఈ తరుణంలో రవాణా రంగం తక్కువ ఖర్చుతో కూడిన, కాలుష్య రహిత, స్వదేశీ పరిష్కారాలపై దృష్టి పెట్టాలని మంత్రి అన్నారు.

ఈ సందర్భంగా బస్సు తయారీదారులను ఉద్దేశించి గడ్కరీ గట్టి హెచ్చరిక చేశారు. ఖర్చు తగ్గించుకోవడానికి భద్రత, నాణ్యత విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ప్రజలు ఇప్పుడు చౌకైన వాహనం కంటే సురక్షితమైన, మెరుగైన వాహనానికే ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. దేశంలో బస్సుల తయారీ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 1,000 మందికి ఎనిమిది బస్సులు ఉండగా, మనదేశంలో ప్రతి 1,000 మందికి కేవలం రెండు బస్సులు మాత్రమే ఉన్నాయి. రాబోయే మూడేళ్లలో కేవలం ఎలక్ట్రిక్ బస్సుల అవసరమే 1.5 లక్షల యూనిట్లకు చేరుతుందని గడ్కరీ అంచనా వేశారు. ఇది పరిశ్రమకు పెద్ద అవకాశమన్నారు.

Next Story