IPOs: మళ్లీ ఐపీఓకు సిద్ధమవుతున్న కంపెనీలు

by S Gopi |

ఈ నెల మూడో వారంలో ఇప్పటికే బెల్రైజ్ ఇండస్ట్రీస్, బొరానా వీవ్స్ బిడ్డింగ్ ప్రక్రియను ప్రారంభించాయి.

IPOs: మళ్లీ ఐపీఓకు సిద్ధమవుతున్న కంపెనీలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది ప్రారంభం నుంచి భారత స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య స్థిరమైన ర్యాలీని చూస్తున్నాయి. ఈ కారణంగా దలాల్ స్ట్రీట్‌లో పబ్లిక్ ఆఫర్(ఐపీఓ)లు కూడా పెద్దగా రాలేదు. చాలా కంపెనీలు మార్కెట్ పరిస్థితులను బట్టి ఐపీఓ ప్రక్రియలో ముందుకెళ్లాలని భావిస్తున్నాయి. అయితే, తాజాగా పరిస్థితులు సానుకూలంగా మారుతున్నాయి. ఈ నెలలో అమెరికా టారిఫ్ విషయంలో పరిస్థితులు మారడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, ఇతర పరిణామాల నేపథ్యంలో సూచీలు రాణిస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ ఐపీఓలు రెడీ అవుతున్నాయి. ఈ నెల మూడో వారంలో ఇప్పటికే బెల్రైజ్ ఇండస్ట్రీస్, బొరానా వీవ్స్ బిడ్డింగ్ ప్రక్రియను ప్రారంభించాయి. చివరి వారలో మరో నాలుగు ఐపీఓలు మార్కెట్లలో అడుగు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో స్కోడా ట్యూబ్స్, ప్రోస్టార్మ్ ఇన్ఫో సిస్టమ్స్, లీలా హోటల్స్, ఏజిస్ వొపాక్ టెర్మినల్స్ వంటి కంపెనీలు ఉన్నాయి.

ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఐపీఓ మార్కెట్ ఏమంత ఉత్సాహంగా లేదు. అయితే, ఐపీఓకు ముందు ప్రక్రియ విషయంలో మాత్రమే పెద్ద ఎత్తున సెబీకి దరఖాస్తులు, డీఆర్‌హెచ్‌పీ పత్రాలు అందాయి. దీన్ని బట్టి కంపెనీలు పబ్లిక్ లిస్టింగ్‌లపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయని తెలుస్తుంది. ఇప్పటికే సెబీ వద్ద పత్రాలు సమర్పించిన కంపెనీల్లో ప్రెస్టెజ్ హాస్పిటాలిటీ వెంచర్స్, కెనరా హెచ్ఎస్‌బీసీ లైఫ్ ఇన్సూరెన్స్, అర్బన్ కంపెనీ ఉన్నాయి. ఇన్‌క్రెడ్, క్యూర్ ఏఐ, డ్యూరోఫ్లెక్స్, గ్రో, షిప్‌రాకెట్ వంటి కొత్త జనరేషన్ కంపెనీలు కూడా మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.

మరోవైపు.. 2025లోనే ఐపీఓ ప్రక్రియను ప్రారంభించాలని కొన్ని బడా కంపెనీలు కూడా చూస్తున్నాయి. వాటిలో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ రూ. 40 వేల కోట్ల పబ్లిక్ ఇష్యూతో వచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే భారత చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ కానుంది. టాటా క్యాపిటల్, ఫోన్‌పే, జెప్టో లాంటి పెద్ద కంపెనీల పేర్లు కూడా ఐపీఓ విషయంలో వినిపిస్తున్నాయి. ఫైనాన్స్ రంగంలో హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ రూ. 12,500 కోట్లు, హీరో ఫిన్‌కార్ప్ రూ. 3,668 కోట్ల నిధులు సమీకరించాలని భావిస్తున్నాయి. సెబీ నుంచి ఆమోదం పొందిన ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా కూడా రూ. 15,000 కోట్ల విలువైన ఆఫర్ ఫర్ సేల్‌కు సిద్ధమవుతోంది. ఎప్పుడు అనేది కంపెనీ ఇంకా స్పష్టంగా పేర్కొనలేదు.

Next Story