Anil Ambani: రూ. 17 వేల కోట్ల మోసం కేసులో మరోసారి అనిల్ అంబానీకి ఈడీ సమన్లు

by S Gopi |

ఈ కేసులో అనిల్ అంబానీని అధికారికంగా ప్రశ్నించడం ఇది రెండవసారి.

Anil Ambani: రూ. 17 వేల కోట్ల మోసం కేసులో మరోసారి అనిల్ అంబానీకి ఈడీ సమన్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: పారిశ్రామికవేత్త అనిల్ అంబానీపై దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు పెంచింది. వర్చువల్ స్టేట్‌మెంట్ కోసం అనిల్ అంబానీ చేసిన అభ్యర్థనను తిరస్కరించిన అనంతరం వచ్చే సోమవారం(నవంబర్ 17) హాజరు కావాలని ఈడీ ఫెమా కింద అనిల్ అంబానీకి కొత్త సమన్లు ​​జారీ చేసింది. ఇదివరకు అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ (ఏడీఏజీ)తో సంబంధం ఉన్న అనేక కంపెనీలపై ప్రభుత్వం కొత్త దర్యాప్తుకు ఆదేశించింది. ఈసారి దర్యాప్తును కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ) ప్రత్యేక విభాగం సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ)కి అప్పగించారు. ఈ కేసులో అనిల్ అంబానీని అధికారికంగా ప్రశ్నించడం ఇది రెండవసారి. ఆగస్టులో మొదటి విచారణ ఎనిమిది గంటలకు పైగా కొనసాగింది. అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇన్‌ఫ్రా సహా పలు కంపెనీలు రూ.17,000 కోట్లకు పైగా నిధులను అక్రమంగా తరలించినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

కొత్త దర్యాప్తు ఎందుకు?

సంబంధిత వ్యక్తులు తెలిపిన వివరాల ప్రకారం, కార్పొరేట్ వ్యవహారాల శాఖకు చెందిన ఆడిటర్లకు పలు ఆర్థిక సంస్థల నుంచి అనేక రకాల అలర్ట్స్ వచ్చాయి. వీటిలో కొన్ని ఏడీఏజీ అనుబంధ కంపెనీల ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్లలో అవకతవకలు జరిగినట్టు అభిప్రాయపడ్డాయి. ముఖ్యంగా రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్‌లో రుణ ఎగవేతల తర్వాత బ్యాంకులు చేపట్టిన ఫోరెన్సిక్ ఆడిట్‌లు కూడా వెలుగులోకి రావడంతో ఈ విషయంపై ఈడీ చర్యలను కఠినతరం చేసింది.దీంతో ప్రస్తుతం రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్ ఇన్‌ఫ్రా, రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్, సీఎల్ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలపై నిఘా పెంచారు. నిధుల మళ్లింపునకు సంబంధించి లింకులు బయటపడితే మరిన్ని రిలయన్ గ్రూప్ కంపెనీలను నిఘా పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.

Next Story