Valeo: భారత్‌లో 'వాలియో' రూ. 2,100 కోట్ల పెట్టుబడులు

by S Gopi |

దీని ద్వారా దేశంలో కంపెనీ గణనీయంగా విస్తరించే అవకాశం లభిస్తుందని, ఈ పెట్టుబడులు 'ఎలివేట్ 2028' ప్రణాళికలో భాగంగా ఉంటాయని కంపెనీ వెల్లడించింది.

Valeo: భారత్‌లో వాలియో రూ. 2,100 కోట్ల పెట్టుబడులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఫ్రెంచ్ కార్ల విడిభాగాల తయారీ సంస్థ వాలియో దేశీయంగా భారీ పెట్టుబడులు ప్రకటించింది. భారత మార్కెట్లో 200 మిలియన్ యూరోలకు పైగా(మన కరెన్సీలో రూ. 2,146.18 కోట్లు) పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నట్టు కంపెనీ బుధవారం ప్రకటనలో తెలిపింది. దీని ద్వారా దేశంలో కంపెనీ గణనీయంగా విస్తరించే అవకాశం లభిస్తుందని, ఈ పెట్టుబడులు 'ఎలివేట్ 2028' ప్రణాళికలో భాగంగా ఉంటాయని కంపెనీ వెల్లడించింది. దీని ద్వారా 2024 నాటికి కంపెనీ అమ్మకాల విలువ 220 మిలియన్ యూరోల నుంచి 2028 నాటికి 700 మిలియన్ యూరోలకు పెరుగుతాయని అంచనా వేస్తున్నాం. కంపెనీ అమ్మకాలు రాబోయే మూడేళ్లలో మూడు రెట్లు పెరుగుతాయని వాలియో సీఈఓ క్రిస్టోఫ్ పెరిల్లాట్ చెప్పారు. అంతేకాకుండా 2028 తర్వాత కూడా కంపెనీ మరింత వేగంగా వృద్ధిని సాధిస్తుందనే నమ్మకం ఉందని అభిప్రాయపడ్డారు. భారత్‌తో పాటు అంతర్జాతీయంగా కార్ల తయారీ కంపెనీలకు పెరుగుతున్న అవసరాలను తీర్చడానికి కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల వేగవంతమైన వృద్ధిని, కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తోంది. భారత్‌ను తాము ప్రపంచవ్యాప్తంగా మూడు ముఖ్యమైన మార్కెట్లలో ఒకటిగా పరిగణిస్తున్నట్టు వెల్లడించింది. కాగా, వాలియో కంపెనీ భారత మార్కెట్లో 1997 నుంచి కార్యకలాపాలను నిర్వహిస్తోంది. కంపెనీకి చెన్నై, పూణె, సనంద్, గుర్గావ్‌లో ఆరు తయారీ ప్లాంట్లు ఉన్నాయి. చెన్నై, బెంగళూరులలో గ్లోబల్ ఆర్అండ్‌డీ సెంటర్లు కూడా ఉన్నాయి. కంపెనీలో 7,500 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

Next Story