Gold Investments: రికార్డు స్థాయికి బంగారం ధరలు.. పెట్టుబడి కోసం 4 తెలివైన మార్గాలు

by S Gopi |   (  Updated:2025-10-10 12:43:37  IST  )

మరో వారం రోజుల్లో ధన త్రయోదశి (ధన్‌తేరాస్‌) ఉన్న నేపథ్యంలో చాలామంది సెంటిమెంట్ కోసం కొంతైనా బంగారం కొనాలని భావిస్తారు.

Gold Investments: రికార్డు స్థాయికి బంగారం ధరలు.. పెట్టుబడి కోసం 4 తెలివైన మార్గాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఒకప్పుడు బంగారంలో పెట్టుబడి అంటే ఆభరణాలు, నాణేలు, కడ్డీలు వంటివి ఉండేవి. అయితే, కాలం మారిపోయింది. సాంకేతికత మన జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తోంది. అలా బంగారంలో మనం పెట్టుబడి పెట్టే విధానం చేరింది. ఇప్పుడు భౌతిక బంగారంతో పాటు, వివిధ రకాల డిజిటల్ రూపాల్లోనూ బంగారంలో పెట్టుబడికి అవకాశాలు ఉన్నాయి. మరో వారం రోజుల్లో ధన త్రయోదశి (ధన్‌తేరాస్‌) ఉన్న నేపథ్యంలో చాలామంది సెంటిమెంట్ కోసం కొంతైనా బంగారం కొనాలని భావిస్తారు. సంప్రదాయకంగా ప్రజలు ధన్‌తేరాస్‌లో బంగారం, వెండి, విలువైన ఇతర పాత్రలను కొంటారు. దీనివల్ల సంపద, అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు. అయితే, ఈ ఏడాది బంగారం ధరలు ఊహించని స్థాయిలో పెరిగిపోవడంతో చాలామంది కొనాలా? వద్దా? అనే డైలమాలో పడిపోయారు.

కానీ, ప్రజలు ఇప్పుడు బంగారాన్ని భౌతిక రూపంలోనే కాకుండా పూర్తిగా ఎన్ని లక్షలైనా డిజిటల్ రూపంలో స్వచ్ఛమైన బంగారంలో పెట్టుబడి పెట్టే అవకాశాలు పెరిగాయి. దీనివల్ల పెరిగే బంగారం ధరకు అనుగుణంగా ప్రయోజనాలను పొందవచ్చు. అంతేకాకుండా బంగారంలో పెట్టుబడిగా పెట్టిన మొత్తాన్ని అదే రోజు లేదా స్టాక్ మార్కెట్ తెరిచినప్పుడు తిరిగి పొందే అవకాశం ఉంటుంది.

ఆభరణాల రూపంలోనే కాకుండా రాబడి కావాలనుకునేవారికి డిజిటల్ రూపంలో పెట్టుబడి పెట్టే అవకాశం కూడా ఉంది. అందుకోసం 4 ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. అవేంటంటే..

1.డిజిటల్ బంగారం

డిజిటల్ బంగారం అంటే అధిక స్వచ్ఛత కలిగిన పసిడి. ధరలు పెరిగే కొద్దీ పెట్టిన పెట్టుబడి విలువ కూడా పెరుగుతుంది. భౌతిక బంగారంలా కాకుండా, డిజిటల్ బంగారంపై ఎటువంటి మేకింగ్ ఛార్జీలు ఉండవు. డిజిటల్ బంగారాన్ని విక్రేతలు డిజిటల్ రూపంలో నిల్వ చేస్తారు. ఈ రకమైన బంగారం అధిక లిక్విడిటీని అందిస్తుంది. 24X7 కొనుగోలు, అమ్మకం నిర్వహించవచ్చు. ఈ విధానంలో బంగారం కొనాలంటే పెట్టుబడిదారులు తక్కువ మొత్తం రూ. 1 నుంచి డిజిటల్ బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు.

డిజిటల్ బంగారంలో ఒకేసారి పెట్టుబడి పెట్టే అవకాశం కూడా ఉంది. దేశంలోని చాలావరకు బంగారు పెట్టుబడి ప్లాట్‌ఫామ్‌లు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్)ను కూడా అందిస్తున్నాయి.

2. గోల్డ్ ఈటీఎఫ్‌లు

గోల్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు) స్వచ్ఛమైన భౌతిక బంగారంలో పెట్టుబడి పెడతాయి. గోల్డ్‌ ఈటీఎఫ్‌ ఒక యూనిట్‌ కొంటే పెట్టుబడిదారులు ఆ మేరకు 99.5 శాతం స్వచ్ఛతతో బంగారాన్ని కొన్నట్టే. బంగారం రేట్లలో ఉండే హెచ్చుతగ్గులే గోల్డ్‌ ఈటీఎఫ్‌లపైన ఉంటాయి. బంగారం 10 శాతం పెరిగితే గోల్డ్‌ ఈటీఎఫ్‌ యూనిట్‌ ధర కూడా 10 శాతానికి కొంచెం అటూ ఇటూగా రాబడి ఇస్తుంది. ఈ ఈటీఎఫ్‌లను ఇతర స్టాక్‌ల మాదిరిగానే షేర్ మార్కెట్‌లో కొనవచ్చు, అమ్మవచ్చు. బంగారు ఈటీఎఫ్‌లను కొనేందుకు కొనుగోలుదారుకు డీమ్యాట్ ఖాతా ఉండాలి. ఈ రకం మదుపు అధిక లిక్విడిటీని అందిస్తాయి, కానీ వాటిని మార్కెట్ సమయాల్లో మాత్రమే ట్రేడింగ్ చేయవచ్చు.

3. గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్

గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా గోల్డ్ ఈటీఎఫ్ యూనిట్లను కొనుగోలు చేయడం ద్వారా స్వచ్ఛమైన బంగారంలో పెట్టుబడి పెడతాయి. పెట్టుబడిదారులు బంగారు మ్యూచువల్ ఫండ్లలో ఒకేసారి పెట్టుబడి పెట్టవచ్చు లేదా వారు బంగారు మ్యూచువల్ ఫండ్లలో సిప్‌ను ప్రారంభించవచ్చు. భౌతిక బంగారంలో నేరుగా పెట్టుబడి పెట్టకూడదని భావించే మొదటిసారి పెట్టుబడిదారులకు గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అనువుగా ఉంటాయి.

అయితే, బంగారు మ్యూచువల్ ఫండ్లు సాధారణంగా బంగారు ఈటీఎఫ్‌ల కంటే రాబడి తక్కువగా ఉంటుంది. అంటే వాస్తవ బంగారం లేదా బంగారు ఈటీఎఫ్‌ల కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. కానీ, దీర్ఘకాలంలో ఇవి కూడా మంచి రాబడిని ఇస్తాయి.

4. సావరిన్ గోల్డ్ బాండ్లు (ఎస్‌జీబీలు)

ఎస్‌జీబీలు కేంద్ర ప్రభుత్వం భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ద్వారా జారీ చేసే సెక్యూరిటీలు. అవి 999 స్వచ్ఛత కలిగిన బంగారంతో సమానం. 8 ఏళ్ల మెచ్యూరిటీతో ఇవి లభిస్తాయి. అయితే, జారీ చేసిన తేదీ నుంచి ఐదేళ్ల తర్వాత మాత్రమే ముందుగా తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రస్తుతం, ఎస్‌జీబీలలో కొత్త పెట్టుబడులు అందుబాటులో లేవు. వాటిని సెకండరీ మార్కెట్ ద్వారా మాత్రమే కొనుగోలు చేయవచ్చు.

Next Story