Flipkart: ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌లో మొత్తం వాటా అమ్మేసిన ఫ్లిప్‌కార్ట్

by S Gopi |

ఏబీఎఫ్ఆర్ఎల్‌లో ఫ్లిప్‌కార్ట్ ఇన్వెస్ట్‌మెంట్‌కు 6 శాతం ఉండగా, దాన్ని రూ. 79.50 వద్ద అమ్మేసింది.

Flipkart: ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌లో మొత్తం వాటా అమ్మేసిన ఫ్లిప్‌కార్ట్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్ ఇన్వెస్ట్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌(ఏబీఎఫ్ఆర్ఎల్)లో తనకున్న మొత్తం వాటాను బ్లాక్ డీల్ ద్వారా విక్రయించింది. ఈ మేరకు కంపెనీ అధికారిక ప్రకటనలో తెలిపింది. బుధవారం నాటికి ఏబీఎఫ్ఆర్ఎల్‌లో ఫ్లిప్‌కార్ట్ ఇన్వెస్ట్‌మెంట్‌కు 6 శాతం ఉండగా, దాన్ని రూ. 79.50 వద్ద అమ్మేసింది. ఈ ధర అంతకుముందు ఉన్న రూ. 87.24 కటే 7 శాతానికి పైగా తక్కువ. ఫ్లిప్‌కార్ట్ కంపెనీ బ్లాక్ డీల్‌లో మొత్తం 7.31 కోట్ల షేర్లను అమ్మేసింది. ఆఫర్ ఫ్లోర్ ధర ప్రకారం మొత్తం డీల్ విలువ రూ. 583 కోట్లని తెలుస్తోంది. ఈ ఒప్పందానికి బుక్ రన్నర్‌గా గోల్డ్‌మన్ శాక్స్ వ్యవహరించింది. 2020, అక్టోబర్ సమయంలో ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ నుంచి రూ. 1,500 కోట్ల నిధులను సమీకరిస్తున్నట్టు ఏబీఎఫ్ఆర్ఎల్ ప్రకటించింది. అప్పటి నుంచి ఈ స్టాక్ ధర క్రమంగా బలహీనపడుతూ వచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో కూడా తొలి త్రైమాసికంలోనే రూ. 266 కోట్లకు పైగా నష్టాలను నమోదు చేసింది. ప్రస్తుతం ఏబీఎఫ్ఆర్ఎల్ పాంటలూన్స్, లూయిస్‌ఫిలిప్ లాంటి బ్రాండ్లను విక్రయిస్తోంది.

Next Story