Economy: భారత వృద్ధి అంచనాలను పెంచిన ఫిచ్ రేటింగ్స్

by S Gopi |

ఆదాయాలు మెరుగ్గా ఉండటం, ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా ఉండటంతో వ్యవస్థలో ఖర్చు, వ్యాపార కార్యకలాపాలు సానుకూలంగా ఉంటాయి.

Economy: భారత వృద్ధి అంచనాలను పెంచిన ఫిచ్ రేటింగ్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత వృద్ధి అంచనాను 6.5 శాతం నుంచి 6.9 శాతానికి పెంచుతున్నట్టు ఫిచ్ రేటింగ్స్ వెల్లడించింది. ప్రధానంగా ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత్ అంచనాలను దాటి 7.8 శాతం జీడీపీ వృద్ధిని నమోదు చేసింది. దీనికి తోడు దేశవ్యాప్తంగా మొదలైన పండుగ సీజన్‌కు ముందు కేంద్ర ప్రభుత్వం వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) శ్లాబులను తగ్గించి వినియోగదారులకు భారీ ఉపశమనం కల్పించింది. రెండో త్రైమాసికంలో ఊహించిన దానికంటే ఎక్కువగా గిరాకీ ఉండటం, సేవల రంగంలోనూ కార్యకలాపాలు ఊపందుకోవడం, తద్వారా దేశీయ వినియోగం వృద్ధిని పెంచుతుంది. సాధారణంగా భారత ఆర్థికవ్యవస్థ దేశీయ డిమాండ్‌పై ఆధారపడి ముందుకెళ్తుంది. ఆదాయాలు మెరుగ్గా ఉండటం, ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా ఉండటంతో వ్యవస్థలో ఖర్చు, వ్యాపార కార్యకలాపాలు సానుకూలంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక వృద్ధి మరింత మెరుగ్గా ఉంటుందని ఫిచ్ రేటింగ్స్ అభిప్రాయపడింది.

సానుకూల వృద్ధి ఉన్నప్పటికీ, ప్రపంచ వాణిజ్యం చుట్టూ ఉన్న అనిశ్చితి కొంత సవాలుగా ఉంటుందని ఫిచ్ తెలిపింది. భారత దిగుమతులపై అమెరికా ఇటీవల 25 శాతం అదనపు సుంకం(మొత్తంగా 50 శాతం) విధించడం ఉద్రిక్తతలను సృష్టించింది. ఈ సుంకాల విషయంలో తక్కువ సమయంలోనే చర్చించడం మంచిదని ఫిచ్ సూచించింది. అయితే ఈ అనిశ్చితి వ్యాపార సెంటిమెంట్‌ను దెబ్బతీస్తుందని, పెట్టుబడులను ప్రభావితం చేస్తుందని హెచ్చరించింది.

Next Story