వేతన జీవులకు పండుగలాంటి వార్త.. వడ్డీ రేట్లను తగ్గించిన ఆర్బీఐ

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-05 05:22:37  IST  )

లోన్లు తీసుకున్న వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీపి కబురు చెప్పింది.

వేతన జీవులకు పండుగలాంటి వార్త.. వడ్డీ రేట్లను తగ్గించిన ఆర్బీఐ
X

దిశ, వెబ్‌డెస్క్: లోన్లు తీసుకున్న వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురు చెప్పింది. ఈ మేరకు తాజాగా జరిగిన ద్రవ్య పరపతి సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇవాళ అధికారికంగా ప్రకటించారు. దేశంలోని ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లుగా తెలిపారు. ఈ పరిణామంతో ప్రస్తుతం 5.50 శాతంగా ఉన్న రెపో రేటు 5.25 శాతానికి తగ్గనుంది. ప్రస్తుతం 3.35 శాతంగా ఉన్న రివర్స్ రెపో రేటులో ఎలాంటి మార్పు లేదు. అదేవిధంగా క్యాష్ రిజర్వ్ రేషియో యథాతథంగా ఉండగా, ద్రవ్యోల్బణం అంచనా 4.2 శాతం వద్దే కొనసాగనుంది. ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో హోమ్ లోన్, కారు లోన్, పర్సనల్ లోన్‌లపై వడ్డీ రేట్లు మరింత తగ్గే అవకాశం ఉంది. కాగా, ఇప్పటికే వరుసగా రెండోసారి రెపో రేటు తగ్గడం విశేషం.

ఈ సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ.. జీడీపీ వృద్ధి అంచనా 2025-26లో 6.5 శాతం నుంచి 6.7 శాతానికి పెంచినట్లు తెలిపారు. ఆర్థిక వృద్ధిని మరింత ఊపందుకోవడానికి, ప్రజలకు చౌకైన రుణాలు అందేలా ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. తాజా వడ్డీ రేట్ల తగ్గింపుతో దేశవ్యాప్తంగా బ్యాంకులు తమ లోన్ వడ్డీ రేట్లను త్వరలోనే సవరించనున్నాయి. సామాన్యుడికి ఇది గొప్ప ఊరట కలిగించే నిర్ణయంగా ఆర్థిక నిపుణులు అభివర్ణిస్తున్నారు.

Next Story